ఉదండాపూర్ లో బీఆర్ఎస్ అక్రమాల దందా

ఉదండాపూర్ లో నిర్వాసిత కుటుంబాలకు ఇచ్చే ప్యాకేజీ కోసం 300 బోగస్ కుటుంబాల పేర్లు రాయించి పరిహారాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, వారిని జైలుకు పంపకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.

Update: 2024-09-25 10:57 GMT

దిశ, జడ్చర్ల : ఉదండాపూర్ లో నిర్వాసిత కుటుంబాలకు ఇచ్చే ప్యాకేజీ కోసం 300 బోగస్ కుటుంబాల పేర్లు రాయించి పరిహారాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, వారిని జైలుకు పంపకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు బుధవారం ఇద్దరు మంత్రులు విచ్చేసిన నేపథ్యంలో ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద అనిరుధ్ రెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇవ్వాల్సిన నిధుల్లో రూ.45 కోట్లను ప్రభుత్వం మంగళవారం రాత్రి నిర్వాసితుల అకౌంట్లలో జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీని నిర్వాసితులు కోరుతున్న విధంగా రూ.25 లక్షలకు పెంచకుండా రూ.16.30 లక్షలు జమ చేశారని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను పాత్రికేయులు ప్రస్తావించగా, ఆ 16 లక్షల ప్యాకేజీని కూడా గత రెండేళ్లుగా బీఆర్ఎస్ నాయకులకు చేతకాకపోయిందని విమర్శించారు.

    బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదేళ్ల ప్రభుత్వకాలంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిపెట్టి వెళ్లిన నేపథ్యంలో ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను రెండేళ్ల తర్వాత చేయాలని ప్రభుత్వం భావించినా తాను పట్టుబట్టి వెంటనే చేపట్టాలని కోరానని, దాంతో ప్రభుత్వం పనులను ప్రారంభిస్తూ తొలివిడతగా రూ.45 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇంకా రూ.800 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ పట్ల నిర్వాసితులు ఆనందంగానే ఉన్నారని, రిజర్వాయర్ ప్రాంతంలో ఫిల్టర్ ఇసుకను తయారు చేసి అమ్ముకునే వారు, కాంట్రాక్టర్ ను బెదిరించి కమీషన్లు వసూలు చేసుకునేవారు మాత్రమే ప్రజలను రెచ్చగొట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫిల్టర్ ఇసుకను ఎవరూ అమ్ముకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. రిజర్వాయర్ ప్రాంతంలో ఫిల్టర్ ఇసుక, గ్రావెల్ అమ్మకాలను అడ్డుకోవడానికి, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేసే వారిని నిరంతరం కనిపెట్టడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తామని ప్రకటించారు.

    ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను ప్రారంభిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమాల కారణంగా ఉదండాపూర్ నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో నివాసం లేని 300 మంది పేర్లను నిర్వాసితుల జాబితాలో చేర్పించారని, వారికి నిర్వాసిత కుటుంబాలుగా ప్రభుత్వం ఇచ్చే రూ.16 లక్షల పరిహారం మొత్తం లేదా వారికి ఇచ్చే ప్లాట్లలో ఏదో ఒకటి తమకు ఇవ్వాలని ఆ బోగస్ కుటుంబాలతో బీఆర్ఎస్ నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. అలాగే ప్రభుత్వానికి చెందిన భూములు కూడా తమవిగా రికార్డుల్లో మార్పించి ఆ భూములకు చెందిన పరిహార మొత్తాలను కూడా అక్రమంగా తీసుకున్నారని చెప్పారు.

    భూమి ఒకరిదైతే పరిహారం ఆ భూమికి సంబంధం లేని ఇతర వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించి ఆ డబ్బును కూడా బీఆర్ఎస్ నేతలే స్వాహా చేశారని అనిరుధ్ రెడ్డి ధ్వజమెత్తారు. 300 బోగస్ కుటుంబాలను ఉదండాపూర్ జాబితాలోకి చేర్చి పరిహారం తీసుకోవాలని ప్రయత్నిస్తున్న వారిని, ప్రభుత్వ భూములు తమవేనంటూ అక్రమంగా పరిహారం పొందిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉదండాపూర్ నిర్వాసితుల పేరుతో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాను అసెంబ్లీలో కూడా డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను కమీషన్లు తినే ఎమ్మెల్యేను కానని, అక్రమాలను తాను సహించబోనని పేర్కొన్నారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఐదేళ్లలోపు పూర్తి చేస్తామని ప్రకటించారు. 

Tags:    

Similar News