పాలమూరులో ‘హైడ్రా’

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వణుకు పుట్టిస్తోంది.

Update: 2024-09-25 14:50 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వణుకు పుట్టిస్తోంది. ఈ సంఘటనలపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం హైదరాబాద్​ లాంటి వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరించాలని భావించింది. ఇటీవల కొద్ది రోజుల క్రితం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయా జిల్లాల్లో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాల వివరాలను సిద్ధం చేయాలని సీఎం మౌఖిక ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా పట్టణంలో చెరువులు, నాలాలు, కుంటల్లో నిర్మించుకున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

    ఏ ఇళ్లు బఫర్ జోన్లో ఉందో, ఏ ఇళ్లు ఎఫ్ఎల్ పరిధిలో ఉందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా కేంద్రంలోని అన్ని చెరువులు, కుంటలు, నాలాలు, ఆయకట్టు వివరాలను మున్సిపల్, నీటి పారుదల శాఖ అధికారుల నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. ఇందులో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఏకంగా 213 మంది చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టుకున్నట్లు మొదటి జాబితా సిద్ధం చేసి విడుదల చేశారు. ముఖ్యంగా పెద్ద చెరువు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పెద్ద చెరువు 96.11 ఎకరాల్లో విస్తరించి ఉండగా, 200 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్నట్లు తెలుస్తోంది. క్రమంగా పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో 1989 నుంచి చెరువు ఆక్రమణకు గురవుతూ వచ్చినట్లు సమాచారం. అందులో 40 ఎకరాల చెరువును 64 మంది ఆక్రమించినట్లు అధికారుల దగ్గర సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.

    దాదాపు సగానికి పైగా చెరువు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. అలాగే కొత్త చెరువు, ఏనుగొండలోని మాదిగకుంట, మంగలికుంట, ఎస్ఆర్ కుంట చెరువు, శ్రీనివాసకాలనీ చెరువు, పాలకొండ చెరువు, మయూరి పార్కు దగ్గర ఉన్న చెరువు ఇలా పట్టణంలోని అన్ని చెరువుల ఆక్రమణల నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. అదే విధంగా పెద్ద చెరువు నుంచి నాలాలు వెలిశాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం పట్టణంలో పెద్ద చెరువు ఇరువైపులా ఉన్న ఇళ్లకు బఫర్ జోన్ లో ఉన్నాయని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో కూడా అధికారులు స్పష్టత ఇవ్వక పోవడంతో నివాసం ఉంటున్న వారు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఎస్టీఎల్ అంటే చెరువులో నీళ్లు ఆగే స్థలంలో నిర్మాణాలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బఫర్ జోన్ అంటే చెరువుల నుంచి నాలాల ద్వారా నీరు స్వేచ్ఛగా వెళ్లేలా ఉండాలి. ఆ మేరకు ఆ పరిధిలో ఆక్రమణలు జరిగితే కూల్చివేయాల్సి ఉంటుంది.

ప్రైవేట్ వాణిజ్య భవనానికి ఎన్ఏసీ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు?

ఒక వైపు పేద ప్రజలకు నోటీసులు జారీ చేసిన అధికారులు మైత్రి నగర్ లోని పాత పాలమూరు దగ్గర బూత్పూర్ వెళ్లే రహదారిలో పెద్ద చెరువు నాలా మోరీ పక్కన నిర్మాణం అవుతున్న ప్రముఖ వాణిజ్య సంస్థకు ఇరిగేషన్ అధికారులు ఎన్ఏసీ ఇచ్చినట్లు సమాచారం. ఈ వాణిజ్య సముదాయ నిర్మాణం నాలా (బఫర్ జోన్) పక్కనే నిర్మిస్తుంటే అధికారులు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని, ఇందులో మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పేద వారికి ఒక న్యాయం, డబ్బున్న వారికి ఒక న్యాయమా అంటూ నిలదీస్తున్నారు.

పాలమూరులో హైటెన్షన్

అధికారులు నోటీసులు జారీ చేయడంతో గృహస్తులు హైటెన్షన్ కు గురవుతున్నారు. అధికారులు, రాజకీయ నాయకుల దగ్గరికివెళ్లి మొర పెట్టుకుంటున్నారు. తాము ఎప్పుడో రూ. లక్షలు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నామని, ఇప్పుడు వచ్చి బఫర్ జోన్లో ఉందంటూ అధికారులు హల్చల్ చేస్తుండడంతో భయపడుతున్నారు.

     దాదాపు వెయ్యి ఇళ్లకు నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు, వీటిలో దాదాపు 75 శాతం పేద, మధ్య తరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఇక్కడ కూడా అక్రమ నిర్మాణాలపై కూల్చివేతలు ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చితే తమ భవిష్యత్ ఏమిటని మదన పడుతున్నారు. ఏవి బఫర్ జోనో? ఏది ఎఫిటిఎల్ లో ఉందో అర్ధం కాని పరిస్థితుల్లో ప్రజలు అయోమయంలో ఉన్నారు.

Tags:    

Similar News