పాఠశాలల్లోని పెండింగ్​ పనులను త్వరగా పూర్తిచేయాలి

పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Update: 2024-09-25 15:15 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో కేజీబీవీ ప్రిన్సిపాళ్లు, ఎంఈఓలు, ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పెండింగ్ ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజినీర్ అధికారులకు ఆదేశించారు. అసిస్టెంట్ ఇంజినీర్ల పనులపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని, వారి ప్రస్తుత నిర్మాణ పనులు, మంజూరైన మొత్తం నిధులు, కేజీబీవీలకు సంబంధించిన సమాచారం తదితర విషయాలను నివేదిక రూపంలో సమర్పించాలని ఈఈ పీఆర్ లకు ఆదేశించారు.

    జిల్లాలోని ప్రతి కేజీబీవీ పాఠశాలలో నీటి సరఫరా, మరుగుదొడ్లు, శానిటేషన్ పనులను పూర్తి చేయాలని ఇంజినీర్లకు ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అనధికారికంగా పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశిస్తే ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్యలు ఉన్నప్పుడు సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపాలిటీ అధికారులకు, లేదా మండల విద్యాధికారులకు తెలియజేయాలన్నారు. ముఖ్యంగా నీటి కనెక్షన్లు, శానిటేషన్ సమస్యల విషయంలో చర్యలు తీసుకోవాలని సూచించారు.

     మండల విద్యాధికారులు పాఠశాలల సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కేజీబీవీలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశించారు. పాఠశాలల్లో గల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ దామోదర్ రావు, మండల విద్యా శాఖ అధికారులు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, ఇంజినీర్లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News