గతంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ కు నీటి కేటాయింపు చేయలేదు
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా నష్టపోయిందని, క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ లను సందర్శించి అవగాహనతో పనులను వేగవంతం చేయడానికి ప్రాజెక్ట్ లను సందర్శించనున్నట్టు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
దిశ, గద్వాల ప్రతినిధి : గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా నష్టపోయిందని, క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ లను సందర్శించి అవగాహనతో పనులను వేగవంతం చేయడానికి ప్రాజెక్ట్ లను సందర్శించనున్నట్టు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టు లిఫ్ట్ ప్రాజెక్ట్ ల పనులను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులకు, ఎంపీకి గట్టు లిఫ్ట్ పనులను ఇరిగేషన్ అధికారులు వివరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ముందుగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన గట్టు ప్రాంతానికి గట్టు లిఫ్ట్ ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని, నియోజకవర్గంలోని రిజర్వాయర్ల కెపాసిటీ పెంచి శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో 18 టీఎంసీల నీటి కేటాయింపులున్నా కనీసం ఆరు టీఎంసీలు కూడా వాడుకోలేని పరిస్థితి అని, నియోజకవర్గంలో 15 - 20 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్ ను నిర్మిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జూపల్లి సూచించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్ట్ లను త్వరగా పూర్తి చేస్తామన్నారు. గతంలో పాలమూరు జిల్లాలో బతకడానికి బయటకు వలసలు పోయేవారని, భవిష్యత్తులో పాలమూరుకు వలసలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రాజెక్ట్ లను పూర్తి చేసి అభివృద్ధి చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు రూ. 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదని విమర్శించారు.
ర్యాలంపాడు రిజర్వాయర్ కెపాసిటీ పెంచి ఆనకట్ట లీక్ లకు మరమ్మతులు చేసి పూర్తిస్థాయిలో నీటి నిలువ చేస్తామని తెలిపారు. ఆర్డీఎస్ సమస్య, మల్లమ్మ కుంట రిజర్వాయర్ ను చేపట్టి అలంపూర్ నియోజకవర్గంలో కూడా పూర్తిస్థాయి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ లు బండారి భాస్కర్, సరితా తిరుపతయ్య, గట్టు తిమ్మప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్, ఈఎన్సీ అధికారి అనిల్ ఇతర ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.