బీఅర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించండి: చల్లా వంశీచంద్ రెడ్డి
రాష్ట్రంలో ప్రజల శ్రమ దోపిడీ చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలని ఎఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు.
దిశ, వెల్దండ: రాష్ట్రంలో ప్రజల శ్రమ దోపిడీ చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలని ఎఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణ కేంద్రంలో 6వ రోజు ఐకేపీ విఓఏ లు చేపట్టిన నిరవధిక సమ్మెలో ఆయన పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చల్లా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం విఓఏల జీవితాలతో చెలగాటం ఆడుతూ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు, ప్రచార సభలకు, సర్వేలలో పనిముట్టుగా వాడుకుంటూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని విమర్శించారు.
గతంలో కాంగ్రెస్ హాయంలో పొదుపు మహిళ సంఘాలకు అనేకమైన వడ్డీలేని రుణాలిచ్చి మహిళలను ఆర్ధికంగా, సామాజికంగా ఎదగటానికి దోహదపడితే నేడు కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో చేస్తున్న విఓఏ సమ్మెకు కాంగ్రెస్ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని, రాష్ట్రంలో అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్ల పల్లి శేఖర్, సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.