జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రహ్మరథం
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్నగర్ కార్నర్ మీటింగ్ కి వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జడ్చర్ల నియోజకవర్గం నుండి జడ్చర్ల వరకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
దిశ, జడ్చర్ల : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్నగర్ కార్నర్ మీటింగ్ కి వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జడ్చర్ల నియోజకవర్గం నుండి జడ్చర్ల వరకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. బాల నగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు లక్ష్మారెడ్డి, అభిమన్యు రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. బాలానగర్ మండల కేంద్రంలో కేసీఆర్ సుమారు ఐదు నిమిషాల పాటు బస్సులో ఉండి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కేసీఆర్ పై గులాబీ పూల వర్షం కురిపించారు.
అక్కడి నుండి జడ్చర్ల వరకు అభిమన్యు రెడ్డి యువసేన ఆధ్వర్యంలో కేసీఆర్ పై పూల వర్షం కురిపిస్తూ భారీ ర్యాలీగా జడ్చర్ల వరకు తరలి వెళ్లారు. మధ్యలో జడ్చర్ల సమీపంలోని బ్లూ ఫాక్స్ హోటల్ వద్ద కేసీఆర్ బస్సు ఆపి అక్కడ అల్పాహారాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ యువ నేత అభిమన్యు రెడ్డిని కేసీఆర్ కు పరిచయం చేశారు. జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని కష్టపడి పని చేయండి విజయం మనదేనని యువ నేతతో కేసీఆర్ అన్నారు. జడ్చర్ల డ్రైవర్ వద్ద కేసీఆర్ సుమారు ఐదు నిమిషాల పాటు తన బస్సును ఆపి బీఆర్ఎస్ కార్యకర్తలకు అభివాదం చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులను స్థానిక మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కేసీఆర్ కు పరిచయం చేశారు. బీ ఆర్ ఎస్ ఓటమి తర్వాత తొలిసారి కేసీఆర్ జడ్చర్లకు రావడంతో కార్యకర్తలు జయ జయ ధ్వనులతో స్వాగతం పలుకుతూ పార్లమెంటు ఎన్నికల్లో తామంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నామంటూ నినాదాలతో కేసీఆర్ కు హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ కేసీఆర్ మీటింగ్ కు జడ్చర్ల నియోజకవర్గం నుండి ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. కేసీఆర్ పర్యటనలతో జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపించింది.