వలసలు ఆగలేదు.. ముంబై బస్సులను చూపిస్తాం రండి.. డీకే అరుణ

ఎన్నికలు వచ్చినప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ లకు 'పాలమూరు' గుర్తుకు వస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.

Update: 2023-06-23 15:30 GMT

దిశ, మహబూబ్ నగర్ : ఎన్నికలు వచ్చినప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ లకు 'పాలమూరు' గుర్తుకు వస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జూరాల, తంగడి వద్ద నుండి కృష్ణానది ఎత్తిపోతల పథకాన్ని చేపడితే ఇప్పటికి పనులు పూర్తయి ఈ ప్రాంతానికి మేలు జరిగేదని, 8 ఏళ్ళ క్రితం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ఆరోపించారు. సమైక్య పాలనలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారానే పంటలు పండుతునాయి తప్ప, ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆమె ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున, తండ్రి కొడుకులు ఒకరిని మించి మరొకరు జిల్లాకు వస్తున్నారని, ఎక్కడ చూసినా పంటలు పండుతున్నాయి, వలసలు ఆగిపోయాయని, పాలమూరు కరువు తీరింది అంటూ గొప్పగా చెబుతున్నారని ఆమె ఎద్ధేవ చేశారు.

వలసలు ఎక్కడ ఆగాయో? మీరు తీసుకొచ్చిన నీటి పథకాలు ఎక్కడో చూపిస్తారా ? అంటూ ఆమె ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా నుండి ప్రతిరోజు ముంబై బస్సులు వెళ్తున్నాయి చూద్దురు రండి అని తండ్రి కొడుకులను ఆహ్వానిస్తే సమయం లేదంటూ దాటవేస్తున్నారని ఆమె ఆరోపించారు. మేము ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కొని, మళ్లీ పంపిణీ చేసుకున్నారని ఆమె ఆరోపించారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 25 వేల రూపాయలను ఇస్తుందని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబం, నాయకులు తెలంగాణ వనరులను, భూములను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను మీడియా ప్రతినిధులు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వెలుగులోకి తీసుకురావాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, ఎన్పీ వెంకటేష్, క్రిస్టియన్ నాయక్, అంజయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, నారాయణ‌‍ యాదవ్, యాదమ్మ, నీరజ, సుబ్రమణ్యం, ఎంపిటీసీ రాజు గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.

Tags:    

Similar News