సరైన వేతనాలు ఇవ్వాలంటూ ఆశా వర్కర్ల ధర్నా
సరైన వేతనాలు ఇవ్వాలంటూ గద్వాల జిల్లా ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు
దిశ, గద్వాల క్రైమ్: సరైన వేతనాలు ఇవ్వాలంటూ జిల్లాలోని ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. తమతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్నారని, జీతాలు మాత్రం తక్కువిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో తాము ముందు ఉండి ప్రజలకు సేవ చేశామని, కానీ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చాలీచాలని వేతనాలతో కుటుంబం గడవటం కష్టంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా తమతోనే సర్వే చేయిస్తున్నారని, దీని వల్ల పని భారం పెరుగుతోందని తెలిపారు. పోనీ పనికి తగ్గ వేతనం ఇస్తున్నారా అంటే అదీ లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆశా వర్కర్లకు రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.