ఎమ్మెల్యే మాట విన్న అధికారులంతా జైలుకెళ్లడం తధ్యం!..: Nagam Janardhan Reddy
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే సేవకుడిగా కాకుండా రాజు లాగా అహంభావంతో విర్రవీగుతున్నాడని స్థానిక ఎమ్మెల్యే
దిశ, బిజినపల్లి: ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే సేవకుడిగా కాకుండా రాజు లాగా అహంభావంతో విర్రవీగుతున్నాడని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ లీడర్ డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం బిజినపల్లి మండల కేంద్రంలో రేపు నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది దళిత గిరిజన ఆత్మగౌరవం చాటి చెప్పేందుకు ఏర్పాటు చేసుకున్న సభకు సంబంధించిన ఫ్లెక్సీలను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు చించి వేయడంపై మండిపడ్డారు.
సభ జరుగుతున్న సందర్భంగా.. మండల కేంద్రాల్లో తన ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలను సభకు రాకుండా అడ్డుకోవాలన్న కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా ఎదురు తిరిగిన రోజు దిక్కుతోచక మూట ముల్లె సర్దుకుని వెళ్లే పరిస్థితులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గుట్టలు, నల్ల మట్టి దోచుకున్న అంశంలో ఎమ్మెల్యేతో పాటు ఆయనకు సహకరించిన అధికారులంతా కూడా జైలు పాలు కావడం తథ్యమని హెచ్చరించారు.
ఏ తప్పు చేయని నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించి జైలుకు పంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దళితుల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనన్నారు. పేదలకు పట్టెడు అన్నం పెడుతూ కూడు, గూడు, గుడ్డ కల్పించిన పార్టీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. వారి వెంట డీసీసీ ప్రధాన అర్థం రవి, కాంగ్రెస్ నాయకులు శశిధర్ రెడ్డి, మండల అధ్యక్షులు సుహాసన్ రెడ్డి బిజినేపల్లి ఉప సర్పంచ్ రాములు, ఎంపీటీసీ అంజితో పాటు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి : కోమటిరెడ్డిపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు.. రేవంత్‌రెడ్డి రియాక్షన్ ఇదే!