దిశ, అమరచింత: నగరంలో భారీ దొంగతనం. ఒకే దొంగ నాలుగు షాపుల్లో తన చేతివాటం చూపించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. అర్ధరాత్రి 12:50 గంటలకు ఈ చోరీ జరిగింది. ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. స్థానికులు తెలిపిన దాని ప్రకారం.. ఆత్మకూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీ చౌక్ పక్కన ఉన్న మన్విత, నరేశ్, వెంకటేశ్వర, కిరాణా షాపులతో పాటు, పటేల్ సైకిల్ షాపులో కూడా బుధవారం అర్ధరాత్రి 12:50 గంటల ప్రాంతంలో షటర్ తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు.
మన్విత కిరాణాలో రూ.15వేలు, వెంకటేశ్వర కిరాణాలో రూ.5వేలు, సైకిల్ షాపులో రూ.8వేల విలువైన సైకిల్‌ను దొంగ పట్టుకెళ్లిపోయాడు. మరుసటి ఉదయాన్నే షాపులు తెరిచేందుకు వచ్చిన యజమానులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మన్విత కిరాణ షాపులో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా దొంగ మేడపల్లి గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన సాయి కిరాణా షాపు ఎదురుగా ఉన్న బేకరిలో పనిచేస్తుంటాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం చోరీ చేసిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.