కమీషన్లు ఇస్తేనే బిల్లులు.. డీఈ పై సర్పంచుల ఆగ్రహం..

కమీషన్లు ఇస్తేనే బిల్లులు చేస్తున్నారని, ఇష్టానుసారంగా కమీషన్లు తీసుకుంటున్నారని డీఈ శివరామకృష్ణ పై సర్పంచులు ఆగ్రహించారు.

Update: 2023-04-06 16:14 GMT

దిశ, అడ్డాకుల : కమీషన్లు ఇస్తేనే బిల్లులు చేస్తున్నారని, ఇష్టానుసారంగా కమీషన్లు తీసుకుంటున్నారని డీఈ శివరామకృష్ణ పై సర్పంచులు ఆగ్రహించారు. అడ్డాకుల మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ నాగార్జున రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సర్వ సభ సమావేశంలో సర్పంచులు అధికారుల మధ్య రసాభాస కొనసాగింది. బిల్లులపై కమీషన్లు ఇష్టానుసారంగా తీసుకుంటున్నారని డీఈ శివరామకృష్ణ పై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి డీఈ శివరామకృష్ణ సమాధానం ఇస్తూ నేను ఎవరి దగ్గర కమీషన్లు తీసుకోలేదని తెలియజేశారు. దానికి సర్పంచులు మాతో ప్రూఫ్స్ ఉన్నాయని తెలిపారు. ఎంపీపీ నాగార్జున రెడ్డి కలుగజేసుకొని బిల్లుల పై కమీషన్లు అడుగుతే సర్పంచులు అందరు కలిసి రూమ్ లో వేసి తాళం వేయండి అని హెచ్చరించారు.

జడ్పీటీసీ మాట్లాడుతూ సర్పంచులు బిల్లుల కోసం మూడు రూపాయల వడ్డీకి తెచ్చి పనులు చేస్తుంటే అధికారులు మాత్రం డబ్బులకు ఆశపడి బిల్లులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్మనూర్ సర్పంచ్ సుమతమ్మ, బలీదు పల్లి గణేష్, తిమ్మాయిపల్లి తండా సర్పంచ్ కిషన్ నాయక్ మాట్లాడుతూ మిషన్ భగీరథ నీళ్లు రాక రెండు నెలలు అవుతుందని, అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశాంత్ ను నిలదీశారు. మధ్యలో వాల్ ఉంటుందని కరెంటు పోయినప్పుడు ప్రాబ్లం వస్తుందని వారు తెలిపారు. తిమ్మాయపల్లి తాండ సర్పంచ్ కిషన్ నాయక్ మాట్లాడుతూ నర్సరీ, క్రీడా ప్రాంగణాల బిల్లులు రాక సంవత్సరం గడుస్తుందని ఉపాధి హామీ ఈసీ రమేష్, ఏపీఓ అతహార్ బేగంను అడగగా ఈ నెలలో బిల్లులు పూర్తవుతాయని సర్పంచ్ కు తెలిపారు. పలు గ్రామాలలో పెండింగ్ పనుల చర్చ సాగింది.

మన ఇసుక.. మన వాహనం

తహసిల్దార్ మాట్లాడుతూ మన ఇసుక మన వాహనం ద్వారా ఇల్లు కట్టుకునే వారికి డోర్ డెలివరీ ద్వారా అందుబాటులో ఇసుక వస్తుందని తెలిపారు. ఆన్లైన్లో గాని, మీసేవ ద్వారా కానీ రీచ్ బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ ద్వారా మన ఇంటికే ఇసుక వస్తుందని తెలిపారు. ప్రతి ట్రిప్పుకు మూడు వందల రూపాయలు గ్రామపంచాయతీకి ఆదాయం వస్తుందని, ప్రభుత్వానికి 900 ఆదాయం వస్తుందని, ట్రాక్టర్ ఓనర్ కి ప్రతి ఐదు కిలోమీటర్ల లోపు 350 రూపాయల చొప్పున, ఐదు కిలోమీటర్లు దాటి పది కిలోమీటర్లు వరకు 700 రూపాయలు, లేబర్ కి 300 రూపాయలు ఖర్చవుతుందని ఈ అవకాశాన్ని ఇల్లు కట్టుకునేవారు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా తహసిల్దార్ కిషన్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, సింగిల్ విండో అధ్యక్షులు జితేందర్ రెడ్డి, సూపర్డెంట్ శివప్రసాద్, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News