Palla Rajeshwer Reddy : ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలి.. పల్లా రాజేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా సీఎం, మంత్రులు రైతులను మాయ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-19 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా సీఎం, మంత్రులు రైతులను మాయ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అంతా మేమే చేశాం.. కేసీఆర్ హయాంలో ఏం జరగలేదన్నట్టుగా మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్ళ అబద్దాలు చూసి గోబెల్స్ బతికి ఉంటె ఆత్మహత్య చేసుకునే వారన్నారు. ఈ ప్రభుత్వం రైతుల రుణ మాఫీ కోసం విడుదల చేసింది రూ.6 వేల కోట్ల రూపాయలు మాత్రమే అన్నారు. ఇది రుణాలున్న రైతుల్లో 30 శాతం.. డబ్బుల పరంగా చూస్తే 20 శాతం మాత్రమే అన్నారు. రైతులకు కాంగ్రెస్ గోరంత చేసి కొండంతగా గొప్పలు చెప్పుకుంటోందన్నారు.

కేసీఆర్ హయాంలో మొదటి విడతలో 35 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ కింద చెల్లించామన్నారు. రెండో విడతలో రూ.19 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీకి సిద్ధంగా ఉంచుకుని 12 వేల కోట్లు చెల్లించామన్నారు. ఇంకా ఏడు వేల కోట్లు కాంగ్రెస్ ఈసీకి చేసిన ఫిర్యాదుతో చెల్లించకుండా మిగిలి పోయాయన్నారు. ఆ ఏడు వేల కోట్లు మంత్రుల కాంట్రాక్టు సంస్థలకు వెళ్లాయన్నారు. లక్ష లోపు రుణాల మొత్తం కేసీఆర్ హయాంలో రూ.19 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.6 వేల కోట్లకు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. ఎవర్ని మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆంక్షల పేరిట రైతుల రుణ మాఫీని కొందరికే కాంగ్రెస్ సర్కారు పరిమితం చేసిందన్నారు.

కేసీఆర్ హయాంలో రైతుల అకౌంట్లలోకి పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు చేరాయని.. రూ.70 వేల కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ రైతులకిచ్చారన్నారు. రూ.30 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ కింద ఇచ్చారని.. రూ.7 వేల కోట్లు లక్షా 20 వేల మంది రైతుల కుటుంబాలకు బీమా కింద చెల్లించారన్నారు. 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని కేసీఆర్ హయాంలో రైతులు పండించారన్నారు. కాంగ్రెస్ సర్కారు రావడంతో రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రుణమాఫీని ఏ ఆంక్షలు లేకండా సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు.


Similar News