రాష్ట్ర విభజన సమస్యలపై సమావేశం వాయిదా

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం వాయిదా పడింది.

Update: 2024-10-24 04:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం వాయిదా పడింది. తదుపరి తేదీలను ఇరు రాష్ట్రాలతో చర్చి్ంచి వెల్లడిస్తామని హోంశాఖ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లయినప్పటికీ, ఇంకా అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసి విభజన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ తాజాగా సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు, ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉన్న ఈ సమావేశం వాయిదా పడటంతో మరికొంత కాలం విభజన సమస్యలపై ప్రతిష్టంభన కొనసాగనుంది.

విభజన చట్టం షెడ్యూల్ 13లో రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల ఏర్పాటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అంశాలు, తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు , ఆంధ్రప్రదేశ్‌లోనూ కడప స్టీల్ ప్లాంటు, పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల అంశాలలోని ఆర్టీసీ, ఎస్​ఎఫ్సీ అంశాలు పరిష్కారం కావాల్సిఉంది.

విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ వేదికగా జూలై 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు కీలక భేటీ జరిపారు. విభజన సమస్యల పరిష్కార మార్గాలపై ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కమిటీలో సీఎస్‌లు, ముగ్గురు సభ్యులు ఉంటారని వెల్లడించారు. కమిటీ ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో కమిటీ వేస్తామని పేర్కొన్నారు. మంత్రుల కమిటీ కూడా పరిష్కరించకుంటే సీఎంల స్థాయిలో భేటీలు ఉంటాయని తెలిపారు. కమిటీలు అనేక పెండింగ్‌ అంశాలపై చర్చిస్తాయని పేర్కొన్నారు. డ్రగ్స్, సైబర్‌ క్రైమ్స్‌ అరికట్టేందుకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తదుపరి చర్యల విషయంలో ముందడుగు పడలేదు. 


Similar News