దమ్ముంటే రండి ఢిల్లీలో ధర్నా చేద్దాం.. రాష్ట్ర ప్రభుత్వానికి తమ్మినేని సవాల్

రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి పరిరక్షణపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నాకు సిద్ధపడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

Update: 2024-07-29 07:37 GMT

దిశ, బెల్లంపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి పరిరక్షణపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నాకు సిద్ధపడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట్రా చౌరస్తా వద్ద సోమవారం జరిగిన సింగరేణి పరిరక్షణ యాత్ర సభలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థను కాపాడుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిలపపక్షాలతో కలిసి ఢిల్లీలో ఉద్యమిద్దామని అన్నారు. సింగరేణి ప్రైవేట్ కరణ దేశానికి ప్రజలకు తీరని నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ పై రాష్ట్ర ప్రభుత్వానికి  51 శాతం హక్కు ఉందన్నారు. అధిక శాతం ఉన్న సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థపై కేంద్రం మోడీ ప్రభుత్వం పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆదాని, అంబానీ పెట్టుబడిదారులకు సింగరేణిని అమ్మకం పెడుతున్నారని విమర్శించారు. ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరోవైపు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి ప్రైవేటీకరణ చేయమంటూనే బొగ్గు గనులను వేలం ఇస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణ లేదంటూనే సింగరేణిలో బొగ్గు గనులను ఎందుకు వేలం వేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి ప్రజలకు సింగరేణి లోకానికి అర్థమవుతుందని అన్నారు. అందుకోసమే సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం సీపీఎం రాష్ట్ర కమిటీ పోరుబాట పట్టిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయమని ఒప్పుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఈ పోరాటంలో అన్ని పార్టీలు ప్రజలు వ్యాపారులు భాగస్వామ్య కావాలని కోరారు. సింగరేణి ప్రైవేట్ కరణ నిలుపుదల ఒక్క సీపీఎంతోనే ఆగదని పేర్కొన్నారు. సింగరేణిలో 900 కోట్ల టన్నుల బొగ్గు బిక్షేపాలు ఉన్నాయని తెలిపారు. ఈ నిక్షేపాలను పెట్టుబడుదారులు ఆదానీ, అంబానీలకు అమ్మడానికి మోదీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఈ రెండు పార్టీల ప్రభుత్వాల చీకటి ఒప్పందాలను అర్థం చేసుకొని యావత్ సింగరేణి ప్రజలందరూ పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థను కాపాడుకుంటేనే ప్రజలకు బతుకు తెరువు, ముందు తరాలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రామయ్య, భూపాల్, సీఐటీయూ సింగరేణి డిప్యూటీ కార్యదర్శి నాగరాజు గోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, నాయకులు ఎస్.రమణ తదితరులు పాల్గొన్నారు. 


Similar News