అవి కేసీఆర్ హయాంలో కొన్న కార్లే.. ల్యాండ్ క్రూజర్ వాహనాల వివాదంపై ప్రభుత్వం రియాక్షన్

మంత్రులకు కేటాయించిన ల్యాండ్ క్రూజర్ వాహనాల వివాదంపై ప్రభుత్వం స్పందించింది.

Update: 2024-06-12 10:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మంత్రులకు కొత్తగా ల్యాండ్ క్రూజర్ కార్లను ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కేటాయించడంపై సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న విమర్శలను తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. బుల్లెట్ ప్రూఫ్ తో పాటు శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ వాహనాలను మంత్రులకు కేటాయించడం వెనుక సీఎం దుబారా కనిపిస్తోందని, అసలు పాత వాహనాలనే మంత్రులకు కేటాయించారా? లేక కొత్త వాహనాలు కొనుగోలు చేశారా అనే సందేహం కలుగుతోందని ఓ తెలుగు దినపత్రికలో (దిశ కాదు) కథనం ప్రచురితం అయింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై కొంత మంది కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి వాహనాలు కొనుగోలు చేయలేదని స్పష్టం చేసింది.

‘2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం మొదట 4 టయోటా ల్యాండ్ క్రూజర్ (300 సీరిస్) వాహనాలను కొనుగోలు చేసింది. ఈ 4 వాహనాలను ఫ్యాబ్రికేషన్ కోసం విజయవాడలోని త్రినయని ఇంజనీరింగ్ వర్క్స్ కు అప్పగించింది. ఆ పనులు పూర్తి చేసి 2023 మే, జూన్ లో వాటిని డెలివరీ చేశారు. ఆ తర్వాత మే 2023లో కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులకు అప్పటి ప్రభుత్వం మళ్లీ 22 ల్యాండ్ క్రూజర్ (300 సిరీస్) వాహనాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ను జారీ చేసింది. ఆ వాహనాలు డెలివరీ అయిన తర్వాత మొత్తం 22 వాహనాలను ఫ్యాబ్రికేషన్ కోసం విజయవాడకు చెందిన త్రినయని ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు పంపించారు. ఫ్యాబ్రికేషన్ పనుల తర్వాత 2023 మోడల్ కు చెందిన 22 ల్యాండ్ క్రూజర్ వాహనాలు విజయవాడ నుంచి డిసెంబర్ 2023 నుంచి డెలివరీ చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 20 వాహనాలు ప్రభుత్వానికి అందాయని ఇంకా 2 వాహనాలు డెలివరీ కాలేదని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. అంతే తప్ప ఈ వాహనాలేవి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసినవికాదు’ అని స్పష్టం చేసింది.

Tags:    

Similar News