KCR నిర్ణయంపై Kunamneni సంచలన వ్యాఖ్యలు

రాబోయే ఎన్నికల్లో కలిసి పని చేయబోతున్నట్టు గత కొంత కాలంగా బీఆర్ఎస్, కమ్యూనిస్టులు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

Update: 2022-12-13 09:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో కలిసి పని చేయబోతున్నట్టు గత కొంత కాలంగా బీఆర్ఎస్, కమ్యూనిస్టులు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో మొదలైన వీరి స్నేహ బంధం వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగుతుందని పదే పదే చెబుతున్నా ఎక్కడో ఓ మెలిక లాంటి అంశం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కార్యవర్గ కౌన్సిల్ సమావేశంలో మంగళవారం మాట్లాడిన ఆయన పొత్తులపై ఆసక్తికర రీతిలో స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోకుండా నిలువరించేందుకే తాము బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పిన ఆయన 119 నియోజకవర్గాల పరిధిలో సీపీఐని బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.

ఆ జిల్లాపై ఫోకస్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సైతం కేసీఆర్ కొన్ని సీట్లను కేటాయించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై స్పందించిన తీరు హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు గెలుపొందేందుకు సీపీఐ కృషి చేస్తుందని వెల్లడించారు. దీంతో సీపీఐ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతోందనే చర్చ తెరపైకి వస్తోంది. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంతో పాటు మరి కొన్ని నియోజక వర్గాలను సీపీఐ పదే పదే ప్రస్తావిస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుపుకు సీపీఐ కృషి చేస్తుందన్న వ్యాఖ్యలను ఎలా అర్థంచేసుకోవాలనేది చర్చగా మారింది. వచ్చే ఎన్నికల్లో పది సీట్లలో సీపీఐ పోటీ చేయబోతోందా లేక ఎవరు పోటీ చేసినా గెలుపుకు కృషి చేస్తుందా అనేది సందేహంగా మారింది. మరో వైపు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు విషయంలోనూ ఆయన ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యేలకు అప్పగించడంపై పెదవి విరిచారు. ఎంపిక అధికారం ఎమ్మెల్యేలకు కాకుండా కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News