సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ
కాంగ్రెస్ పాలనలో ప్రజారోగ్యం పడకేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పాలనలో ప్రజారోగ్యం పడకేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర యంత్రాంగమంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలికొదిలేయడంతో జనం విషజ్వరాలతో మంచం పట్టే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత ఎనిమిది నెలలుగా పారిశ్యుద్ధ నిర్వహణ పూర్తిగా దిగజారిపోయిందని, ఫలితంగా తీవ్రమైన దోమల బెడద కారణంగా డెంగీ, మలేరియా తో పాటు చికెన్ గున్యా లాంటి జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని చోట్లా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం ఆందోళన కలిగించే పరిణామమేనన్నారు.
వర్షాకాలానికి ముందే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజన్ కు ముందే విష జ్వరాలు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్న కనీస అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ఫలితంగానే ఇప్పుడు ప్రజలంతా ఇలా విష జ్వరాల బారిన పడే దుస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు.అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాదిలో దాదాపు 5,700 డెంగీ కేసులు నమోదయ్యాయని, కానీ అనధికారికంగా దీనికి పది రెట్లు ఎక్కువగా ఈ సంఖ్య ఉంటుందని తెలిపారు.
డెంగీ కి సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల ఒక్క డెంగీతోనే ఇటీవల దాదాపు 50 మంది చనిపోయారని, ఇందులో చిన్నపిల్లలు కూడా ఉండటం అత్యంత బాధాకరమన్నారు. గత మూడు నెలలుగా విష జ్వరాల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని కేటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అటు ఆరోగ్యం ఇటు డబ్బులు పోగొట్టుకొని జనం అవస్థలు పడుతుంటే.. పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి రాజకీయ యాత్రలు చేయడం దారుణమని దుయ్యబట్టారు.