కేటీఆర్ చేసిన తప్పు అంగీకరించి ఏసీబీకి లొంగిపోవాలి : ఎంపీ రఘునందన్ రావు
కేటీఆర్ చేసిన తప్పులను అంగీకరించి ఏసీబీకి లొంగిపోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
దిశ, నర్సాపూర్ : కేటీఆర్ చేసిన తప్పులను అంగీకరించి ఏసీబీకి లొంగిపోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం నర్సాపూర్ సమీపంలోని హైదరాబాద్ రూట్ లో ఉన్న మల్లికార్జున స్వామి వార్షికోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసిందని, చేసిన తప్పును అంగీకరించి ఏసీబీకి లొంగిపోవాలని సూచించారు. తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శమని రూ.1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టించామని నిన్నటిదాకా చెప్పుకున్నా కేటీఆర్ నిన్నటి వరకు మంచి వాళ్ళు అయిన పోలీసులు మీకు నోటీసు ఇవ్వగానే చెడ్డ వాళ్ళు ఎలా అవుతారని ప్రశ్నించారు.
10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీల మీద కేసులు పెట్టి లోపలేయించారని గుర్తు చేశారు. దొంగతనం చేసిన వ్యక్తులు వకీళ్లను తెచ్చుకుంటున్నామనడం సరికాదని అన్నారు. లొట్ట పీసు కేసు అన్నావు, ప్రభుత్వం పోయి 13 నెలలు అయినా కేటీఆర్ అహంకారం తగ్గలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డికి మాట్లాడే హక్కు ఎంత ఉందో రఘునందన్ కు అంతే ఉందని అన్నారు. బీజేపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి దొంగల్లాగా కార్యకర్తల మీద దాడి చేసి తలలు పగలగొడతామంటే ఊరుకోమని హెచ్చరించారు.
మీరు ఉన్నాది మూడు రాష్ట్రాల్లో, దేశంలో 20 రాష్ట్రాల్లో మా ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ ను పరోక్షంగా విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ల మీద దాడి చేయాలి అనుకుంటే ఏ పార్టీ కూడా మిగలదని హెచ్చరించారు. ఆఫీసులపై అమాయక కార్యకర్తలపై దాడి చేయడం మానుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మురళి యాదవ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రమేష్ యాదవ్, రాజేందర్, బుచ్చెష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.