వేర్ ఈజ్ కేటీఆర్..? లోక్‌సభ ఫలితాల తర్వాత కనిపించని BRS వర్కింగ్ ప్రెసిడెంట్..!

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు పార్టీ

Update: 2024-06-14 02:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు పార్టీ లీడర్లకు, ఇటు కేడర్‌కు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ హెడ్ క్వార్టర్ అయిన తెలంగాణ భవన్‌కూ ఆయన రావడం మానేశారు. పార్టీ అధినేత కేసీఆర్ పిలిచినప్పుడు ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లడం, అక్కడ చర్చలు జరిపి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది.

రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్క చోటా గెలవలేదు. దీనిపై ఇప్పటి వరకూ సమీక్ష నిర్వహించలేదు. ఓటమిపై బాధను పంచుకోవడానికి అభ్యర్థులకు సైతం ఆయన అందుబాటులో ఉండడం లేదు. ఓ వైపు అధినేతతో, మరో వైపు వర్కింగ్ ప్రెసిడెంట్‌తో కనెక్షన్ కట్ కావడంతో లీడర్లు, కేడర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు.

అసలు పార్టీలో ఏం జరుగుతున్నది..?

అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. ఓటమితో ప్రజలకు మొఖం చూపించుకోలేక కేటీఆర్ అవమాన భారంతో నేతలకు, శ్రేణులకు దూరంగా ఉంటున్నారా?.. లేక మీడియా సమావేశాలకు హాజరైతే సమాధానం చెప్పుకోలేని సంకట పరిస్థితుల్లో తప్పించుకుంటున్నారా?.. ఇవే ఇప్పుడు గులాబీ పార్టీలోని వివిధ స్థాయి నేతల మధ్య జరుగుతున్న చర్చలు.

ఇక్కడే ఉన్నారా.. ఫారిన్ టూర్‌కు వెళ్లారా..?

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో షాడో చీఫ్ మినిస్టర్‌గా వ్యవహరించిన కేటీఆర్ లోక్‌సభ ఎన్నికల తర్వాత సైలెంట్‌గా ఉండిపోవడంతో ఆయన ఇక్కడే ఉన్నారా?.. లేక ఫారిన్ టూర్‌కు వెళ్లారా..? అనే సందేహం కొద్ది మందికి కలిగింది. గతంలో రాజకీయ నాయకులు విమర్శిస్తే ఘాటుగా తిప్పికొట్టే కేటీఆర్.. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత భిన్నంగా కనిపిస్తుండడం పార్టీ లీడర్లకు జీర్ణం కావడంలేదు. బీఆర్ఎస్ అవయవదానం చేసి, సొంత త్యాగం చేసి బీజేపీని బతికించిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి సూటిగా విమర్శలు చేసినా కేటీఆర్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు.

వ్యూహంలో భాగమేనా..?

పార్టీ మళ్లీ పుంజుకునేలా చేసేందుకు సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పులపై కేసీఆర్, కేటీఆర్ కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా?.. ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్‌లను ఢీకొట్టే స్ట్రాటెజీలకు పదును పెడుతున్నారా?.. లేక పార్టీ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని తలెత్తుకోలేని పరిస్థితుల్లో స్కిప్ చేస్తున్నారా?.. ఇవీ కేడర్ నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. అటు అధినేతను, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసే పరిస్థితులు లేనప్పుడు ఇక పార్టీ ఎలా బతికి బట్ట కడుతుందనే సందేహాలు గులాబీ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలనాటికైనా కేడర్‌ను దిశానిర్దేశం చేసే బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది.

‘కేటీఆర్ సర్.. ప్లీజ్ రిజైన్’.. సోషల్ మీడియాలో పోస్టులు

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 చోట్ల గెలిచినా ఆ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాలేదు. కేటీఆర్‌కు సన్నిహితంగా ఉన్న బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్‌లో చేరడమూ పార్టీలో ఆయన పట్టుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. లోక్‌సభ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ దక్కలేదు. గత ఎన్నికల్లో 9 సిట్టింగ్ స్థానాలున్నా ఈసారి అవన్నీ చేజారిపోవడం పార్టీలోనే చర్చకు దారితీసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు కేటీఆర్ ప్రభావమే కారణమనే గొప్పలు పార్టీలో వినిపించినా లోక్‌సభ ఎన్నికల్లో అది రివర్స్ కావడంపై మాత్రం గుసగుసల స్థాయికే పరిమితమయ్యాయి. ఓటమికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యత వహించాలన్న డిమాండ్‌తో పాటు ఆ పోస్టు నుంచి తప్పుకొని హరీశ్‌రావుకు అప్పగించాలని పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.


Similar News