Ethanol factory : ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు
దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ(Dilawarpur Ethanol factory) వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ(Dilawarpur Ethanol factory) వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండు రోజులుగా ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలంటూ దిలావర్‌పూర్ తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం దిలావర్‌పూర్ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. అప్పటి నుంచి గ్రామస్తులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఫాక్టరీ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తుండటంతో.. మంగళవారం గ్రామస్తులు మరోసారి ఫ్యాక్టరీ రద్దు చేయాలని రోడ్డెక్కారు. దాదాపు 12 గంటలకు పైగా పిల్లా పెద్దా అంతా కలసి అర్థరాత్రి వరకు ధర్నాకు దిగారు. గ్రామస్తులకు నచ్చజెప్పడానికి వచ్చిన ఆర్డీవో కళ్యాణిని బంధించారు. ఎట్టకేలకు ఎస్పీ జోక్యం చేసుకొని ఆర్డీవోను వారి నుంచి విడిపించి, పలువురిని అరెస్ట్ చేశారు. బుధవారం మరోసారి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మహిళలు పురుగుల మందు డబ్బాలతో రోడ్డు మీదికి వచ్చి అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయడంతోపాటు.. ఫాక్టరీని రద్దు చేయాలంటూ ఆందోళనకు చేపట్టారు. ఈ వ్యవహారంపై స్పందించిన కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామస్తులతో చర్చలు చేపట్టారు. అనంతరం ఫ్యాక్టరీ పనులు తక్షణమే నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని, మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని కలెక్టర్ వెల్లడించారు.