KTR: రాష్టం అప్పులపాలైందని ఈ ఆర్భాటాలు ఎవరి కోసం.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఎల్లప్పడు యాక్టివ్ గా ఉంటూ అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు.

Update: 2024-10-07 07:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఎల్లప్పడు యాక్టివ్ గా ఉంటూ అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. నిత్యం కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ.. ట్వీట్‌లు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ బడ్జెట్ పై స్పందిస్తూ.. ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి అని విమర్శలు చేశారు. అలాగే తెల్లారి లేస్తే రాష్ట్రం అప్పులపాలైందని, డబ్బులు లేవని బీద అరుపులు అరుస్తూ.. మరొకవైపు మూసీ పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసమని నిలదీశారు.

అంతేగాక రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ.. రైతు రుణమాఫీకి, రైతుబంధుకి, రైతు కూలీలకు, కౌలు రైతులకు డబ్బులు లేవని అన్నారు. అలాగే నిరుద్యోగ భృతికి, పేదవాళ్ల పెన్షన్లకు, మహిళలకు మహాలక్ష్మి పథకం అమలుకు, ఆడపిల్లలకు స్కూటీలకు డబ్బులు లేవని చెప్పారు. ఉద్యోగస్తులకు డీఏలకు.. మునిసిపాలిటీలలో పారిశుధ్య కార్మికుల జీతాలకు, గ్రామాలలో పిచికారీ మందులకు, బడిపిల్లలకు చాక్ పీసులకు, దవాఖానలో మందులకు డబ్బులు లేవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేగాక దళితబంధుకు, విద్యార్థుల స్కాలర్ షిప్‌లకు, విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్‌కు, తులం బంగారం ఇవ్వడానికి, చెరువుల్లో చేపపిల్లలు పెంచడానికి, రెండో విడత గొర్రెల పంపిణీకి కూడా డబ్బులు లేవు అని రాసుకొచ్చారు. 


Similar News