'బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు చివరి గడియలు'

బహుజనులపై అరాచకాలకు పాల్పడుతున్న బీఆర్ ఎస్ పార్టీకి ఇక చివరి గడియలు దగ్గర పడ్డాయని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు.

Update: 2023-09-08 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బహుజనులపై అరాచకాలకు పాల్పడుతున్న బీఆర్ ఎస్ పార్టీకి ఇక చివరి గడియలు దగ్గర పడ్డాయని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. బహుజన నాయకుడు డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బహుజన బిడ్డగా బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు అండగా ఉంటున్నాడనే ఉద్దేశ్యంతో అగ్రవర్ణాలకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు పెట్టి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

బహుజన బిడ్డల పోరాట త్యాగాల ఫలితం వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, తెలంగాణలో బహుజనులు అణచివేతకు అవుతున్నరని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు ఎత్తివేస్తేనే కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట అసెంబ్లీ స్థానం వట్టె జానయ్యకు కేటాయించాలని డిమాండ్ చేశారు. జానయ్యపై అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని లేనియడల మంత్రి జగదీశ్ రెడ్డి బహుజనుల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు.

బహుజన బిడ్డ అయిన వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తే ఉరుకునదిలేదని తాటతీస్తామని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. బహుజనుల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా వారిని అణచివేయడంలో భాగంగానే ఈ అరెస్టులకు తెర లేపినారని అయన ఆరోపించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో సూర్య పెట్ పోలీసులు వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని లేనిపక్షంలో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీలు అంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని తెలిపారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, జానయ్య భార్య వట్టె రేణుక, నేతలు నిల వెంకటేష్, బర్ఖ కృష్ణ, వేముల రామకృష్ణ, తుల ఉమ, ఆర్. లక్ష్మణ్, సురేష్, సతీష్, శ్రీకాంత్, భూమన్న, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News