Kishan Reddy: ప్రభుత్వం మారాక వారిలో మార్పు కనిపిస్తోంది.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ(BJP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్(BRS) దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను పక్కనబెట్టి వ్యక్తిగత కక్షలను కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని సీరియస్ అయ్యారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనేక హామీలు గుప్పించి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతల్లో మార్పు వచ్చింది తప్ప.. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. కాంగ్రెస్‌ది ప్రజాప్రభుత్వం కాదని.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం అని అన్నారు. రైతుభరోసా(Rythu Bharosa)లో అనేక కొర్రీలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులకు సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని తెలిపారు. రుణమాఫీకి కోతలు పెట్టినట్లే రైతు భరోసాకు కూడా కోతలు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల ధరలు పెరిగినా.. కేంద్రం ఏనాడూ రైతులపై భారం వేయలేదని అన్నారు. పెరిగిన భారమంతా కేంద్రమే భరిస్తోందని తెలిపారు. కేంద్రం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎరువుల కోసమ రైతుల వద్దనుంచి నామమాత్రంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించే పంట మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తోందని అన్నారు. కేజీ బియ్యాన్ని రూ.40కి కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు.
అంతేకాదు.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యుత్ కోతలు లేని పరిస్థితి తీసుకొచ్చిందని అన్నారు. బీజేపీ హయాంలోనే ఎరువుల కొరత లేని పరిస్థితులు చూస్తున్నామని తెలిపారు. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతోందని విమర్శించారు.