ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం : తమ్మినేని
ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమైనని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
దిశ, కూసుమంచి : ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమైనని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పద్మా రెడ్డి భవనంలో జరిగిన సీపీఎం మండల స్థాయి జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, ఎన్నికల్లో సహజంగా గెలుపోవటములు ఉంటాయని, సీపీఎం నిరంతరం ప్రజల పక్షాన ఉంటుందని తెలిపారు. ఏ పార్టీ గెలిచినా ప్రజల కష్టాలు ఏమీపోవని ,ప్రజా సమస్యలు ఉన్నంతకాలం ఎర్రజెండా పార్టీ ఉంటుందని, ఎర్రజెండా పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీని అభినందించారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, ఇది ప్రజలు గ్రహించి బీఆర్ఎస్ ప్రభుత్వంను ఓడించారని పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఎక్కువగా డబ్బు ప్రభావం కొనసాగిందని, ఒక్కొక్క ఓటుకి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేశారని ఆరోపించారు. అక్కడక్కడా పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులను క్షమించేది లేదన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తులకు ఆయా గ్రామ శాఖలకు ధన్యవాదాలు తెలిపారు. మల్లెల సన్మతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం పాలేరు డివిజన్ ఇంచార్జి బండి రమేష్, మండల ఇన్చార్జి బుగ్గవీటి సరళ ,మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, తోటకూరి రాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఎర్రబోయిన భారతి, జోన్ కన్వీనర్లు, మండల కమిటీ సభ్యులు, గ్రామ శాఖ కార్యదర్శులు ,సీనియర్ నాయకులు, పార్టీ ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.