'నిలిచేదెవరు.. గెలిచేది ఎవరు.?'.. అక్కడ బీఆర్ఎస్‌లో నాలుగు స్తంభాలాట..

ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి.

Update: 2023-08-06 11:44 GMT

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. నియోజకవర్గాల వారిగా బలమైన అభ్యర్థుల జాబితా కోసం ప్రైవేటు సర్వేలు సైతం ముమ్మరం అయ్యాయి. సర్వేల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసే పనిలో పడ్డారు ప్రధాన పార్టీ నాయకులు. ప్రస్తుతం అధికారుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోను అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ హవ ఒకలా ఉంటే కొత్తగూడెం నియోజకవర్గంలో పరిస్థితి పూర్తి భిన్నంగా గోచరిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఒక్క ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేటు ముట్టనివ్వను అని సవాలు విసిరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంతానికి ప్రాధాన్యత సంతరించుకున్న తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం నాయకుల కోసంఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది.

గూడెం బీఆర్ఎస్‌లో నాలుగు స్తంభాలాట..

ప్రస్తుతం కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని చెప్పవచ్చు. తమ నాయకుడు ఎవరు అని బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుండి 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు పై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి జలగం వెంకట్రావు అఫిడివిటీలో తప్పులు ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు.నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం వనమా వెంకటేశ్వరరావు పై అనర్హత వేటు విధించింది న్యాయస్థానం. ఎన్నికలలో ద్వితీయ స్థానంలో ఉన్న జనగం వెంకట్రావుని ఎమ్మెల్యేగా గుర్తిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చినప్పటికీ ప్రమాణ స్వీకారం జరగకుండా అధిష్టానం అడ్డుపడుతుందని జలగం అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఒకరికి అవకాశం ఇస్తే మరొకరు ఎదురు తిరుగుతారన్న ఆలోచనతో అధిష్టానం కొత్త వ్యక్తిని కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థిగా తెరమీదకి తెచ్చే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

గెలిచి ఓడింది ఒకరు, ఓడి గెలిచింది మరొకరు..2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన వనమ వెంకటేశ్వరరావు 4000 పైచిలుకు ఓట్లతో ప్రత్యర్థి జలగం వెంకట్రావు పైన విజయం సాధించినప్పటికీ ప్రత్యర్థి జలగం వెంకట్రావు తప్పుడు అపిడిబిటి పై కేసు వేసి న్యాయస్థానం ద్వారా విజయం సాధించారు.ఈ పరిస్థితులు చూస్తున్న నియోజకవర్గ ప్రజలు గెలిచి ఓడింది ఒకరు,ఓడి గెలిచింది మరొకరు ఇద్దరిలో ఎవరు నాయకులు అంటూ సందిగ్ధంలో పడ్డారు.

ప్రజా సేవలో గడల,కొత్తగా తెరపైకి తుమ్మల.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా పనిచేస్తున్న గడల శ్రీనివాసరావు తన సొంత గడ్డ రుణం తీర్చుకుంటానంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు.ముఖ్యమంత్రి అనుమతిస్తే కొత్తగూడెం నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధం అంటున్నారు. తన తండ్రి జ్ఞాపకార్థంగా జీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్యా, వైద్యం, ఉపాధి నియోజకవర్గ ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కేసీఆర్ అనుమతిస్తే నియోజకవర్గం నుండి పోటీ చేసి పురిటిగడ్డ రుణం తీర్చుకుంటానని అంటున్నారు.

ఈ నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు కొత్తగా తెరమీదకు వచ్చింది. కొత్తగూడెం నియోజకవర్గం నుండి కేసీఆర్‌కు సవాల్ విసిరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేసినట్లయితే పొంగులేటికి బలమైన ప్రత్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావును కొత్తగూడెం నుండి పోటీ చేపించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గెలిచి ఓడిన వనమా వెంకటేశ్వరరావు, ఓడి గెలిచిన జలగం వెంకట్రావు, పురిటి గడ్డ రుణం తీర్చుకుంటానన్న గడల శ్రీనివాసరావు, కొత్తగా తెరపైకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నలుగురిలో ఎవరికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం బీఫామ్ ఇస్తుందో నాలుగు స్తంభాలాటలో అసలు సిసలైన నాయకులు ఎవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది.


Similar News