గుప్పుమంటోన్న గంజాయి.. రవాణాకు అడ్డాగా మారిన సత్తుపల్లి

సత్తుపల్లి పరిసర ప్రాంతమంతా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి రవాణాకు అడ్డగా మారింది.

Update: 2024-10-19 02:27 GMT

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి పరిసర ప్రాంతమంతా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి రవాణాకు అడ్డగా మారింది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల ఆవులపాక నుంచి గంజాయిని యువకులు టూ వీలర్, కార్లపై విచ్చలవిడిగా రవాణా చేస్తూ వరుసగా పట్టుబడుతున్నారు. వారం క్రితం సత్తుపల్లిలో గంజాయి రవాణా, విక్రయం కేసులో 11 మంది పట్టుబడ్డారు. వారితో పాటు గంజాయి సేవించే వారు 82 మంది ఉన్నట్లు గుర్తించి, వారికి వారం రోజులు పాటు కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయి సేవించే 82 మందిలో 8 మంది మైనర్లు కూడా ఉన్నారు. గంజాయి రవాణాకు వినియోగించిన టూ వీలర్ ఒకటి దొంగిలించినది కావడం విశేషం.

ఇటీవల వీఎం బంజర్ గ్రామం పెనుబల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జునసాగర్ కాల్వ సమీపంలో నలుగురు గంజాయి సేవిస్తున్న యువకులను అరెస్ట్ చేశారు. గత నెలలో భద్రాచలం నుంచి గుంటూరుకు టూ వీలర్‌పై 5 కేజీల గంజాయిని తరలిస్తూ గుంటూరు జిల్లా చిలకలూరిపేట గ్రామానికి చెందిన ఇద్దరిని పట్టుకున్నారు. గత వారం గంజాయి రవాణాదారులు రూట్ మార్చి ఒడిశా నుంచి బయలుదేరే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ తరలిస్తుండగా.. మధిర ఎక్సైజ్ పోలీసులు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అక్కడి నుంచి చాకచక్యంగా జారుకున్నారు.

గత నెలలో ఏపీ, ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామానికి చెందిన నలుగురు యువకులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడటంతో వారిని ఏలూరు, చింతలపూడి పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు మెడికల్ షాపులో లభించే బోనోప్లెక్స్ పీల్చడం ద్వారా మత్తును అనుభవిస్తున్న యువతను గుర్తించి అప్పటి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి, కట్టడి చేయడంలో విజయవంతం అయ్యారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా కేసుల్లో ఎక్కువ భాగం యువత, మైనర్ యువకులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికైనా అంతరాష్ట్ర, జిల్లా పోలీసు ఉన్నత అధికారులు, జిల్లా ఎక్సైజ్ ఉన్నత అధికారులు సమన్వయంతో పని‌చేసి గంజాయి అక్రమ రవాణాను నిర్మూలించాలని కోరుతున్నారు.

‌గంజాయి రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా

సత్తుపల్లిలో గంజాయి రవాణా, విక్రయాలపై నిరంతరం పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటాం. గంజాయి కేసుల్లో యువకులు, మైనర్లు ఉండటం బాధాకరం. తల్లిదండ్రులు తమ పిల్లలను నిరంతం గమనిస్తూ ఉండాలి. ఇటీవల గంజాయి సేవిస్తున్న 82 మందికి కౌన్సిలింగ్ ఇచ్చాం. గంజాయి కేసుల్లో ఎవరైనా పట్టుబడితే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తాం. సత్తుపల్లిలో గంజాయి నిర్మూలనకు ఉక్కుపాదం మోపుతాం. - అనిశెట్టి రఘు, కల్లూరు ఏసీపీ 


Similar News