రైతులకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తాం.. మంత్రి తుమ్మల

రైతులకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Update: 2024-07-08 17:23 GMT

దిశ, వేంసూరు : రైతులకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సాయంత్రం వేంసూరు మండల వేంసూరు - సత్తుపల్లి జాతీయ రహదారి ప్రక్కన జిల్లా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంకును ఏర్పాటు చేయటం సంతోషమని, రాష్ట్రంలో రైతు రుణమాఫీ కింద 31 కోట్లు ఆగస్టు నెలలో అందిస్తామని, రైతులందరికీ పంటల ఇన్సూరెన్స్ బీమాతో పాటు రైతు బీమా ఐదు లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రైతు భరోసా కింద వ్యవసాయం చేసే రైతులందరికీ రైతు భరోసా త్వరలోనే అందిస్తామని తెలిపారు.

కౌలు రైతులు వ్యవసాయ రైతుల నుంచి కౌలు అగ్రిమెంట్ పొందినట్లయితే నేరుగా కౌలు రైతుకు రైతు భరోసా అందిస్తామని, రైతు భరోసా పై రాష్ట్రంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే విధివిధానాలను నిర్ణయిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు. సహకార సంఘాలలో రుణాలు పొందిన రైతులకు మాత్రమే సొసైటీలో ఓటు హక్కు కల్పిస్తామని, సహకార సంఘాలలో రుణాలు పొందని రైతులు ఓటు హక్కును తొలగించేందుకు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, పెట్రోల్ బంకు యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News