దిశ, కొత్తగూడెం: తెలంగాణ అంటేనే ఒక బావోద్వేగం. బతుకమ్మ అంటే మన ఇంటి పండుగ. తెలంగాణలో పుట్టి, పెరిగి, సముద్రాలు దాటి వెళ్ళి స్థిర పడినప్పటికి మన తెలంగాణ మట్టి బిడ్డలు మన సంప్రదాయాలని మరువట్లేదు. మన బతుకమ్మని న్యూజిలాండ్‌లో ఏటా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో కొత్తగూడెం త్రీ ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి లభించింది. న్యూజిలాండ్‌లో స్థిరపడిన తెలంగాణ కుటుంబాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి సంబరాలు నిర్వహించుకున్నారు.