రైతులు ఆయిల్ ఫామ్ పంటవేయాలి
రైతులు లాభదాయకమైన ఆయిల్ ఫామ్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
దిశ, ఖమ్మం : రైతులు లాభదాయకమైన ఆయిల్ ఫామ్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం రఘునాథపాలెం మండలంలోని కోటపాడు, వీఆర్ బంజర, జీకే బంజర, పాపటపల్లి, చిమ్మపూడి గ్రామాల్లో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో జీకే బంజర గ్రామంలో రూ. 17 లక్షల అంచనాతో చేపట్టే 5 అంతర్గత సీసీ రోడ్ల పనులకు, వీఆర్ బంజరలో రూ. 21 లక్షలతో చేపట్టే 4 అంతర్గత సీసీ రోడ్డు పనులకు, పాపటపల్లిలో రూ. 13.5 లక్షలతో చేపట్టే 10 అంతర్గత సీసీ రోడ్డు పనులకు, కోటపాడులో రూ. 56 లక్షల 50 వేల వ్యయంతో చేపట్టిన 23 అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, చిమ్మపూడిలో రూ. 90 లక్షల వ్యయంతో చేపట్టిన 20 అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, సీఆర్ఆర్ నిధుల ద్వారా రూ. 2 కోట్ల 85 లక్షల వ్యయంతో చేపట్టిన కోటపాడు నుంచి పాపటపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. మండలంలో స్థలం ఉండి, ఇండ్లు లేని పేదల జాబితా ఫొటోలతో సహా తయారు చేయాలని, వివరాలను పంచాయతీ కార్యదర్శుల ద్వారా సేకరించాలని కోరారు. ఖమ్మం నుంచి డోర్నకల్ వెళ్లే బస్సు బుగబంజర గ్రామం వయా వెళ్లే విధంగా చూడాలని ప్రజలు కోరారు. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. పామాయిల్ సాగు చేసినా మిర్చి అంతర పంటగా వేయవచ్చని తెలిపారు. రూ.2 లక్షల పైరుణాలు ఉన్న రైతులకు కూడా త్వరలో షెడ్యూల్ ప్రకటించి రుణ మాఫీ చేస్తామని, రైతు భరోసా పథకం త్వరలో అమలు అవుతుందని తెలిపారు.
పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, రైతుల తరపున పూర్తి స్థాయిలో బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. రఘునాథపాలెం మండలం రైతులు పూర్తిస్థాయిలో ఆయిల్ ఫామ్ పంటలు వేయాలని, రాబోయే నెలలో ఎత్తిపోతల పథకం పెట్టి మండలంలోని అన్ని గ్రామాలకు సాగర్ నీళ్లు తీసుకువచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. జమ్ములబాగు బావిలో క్లీనింగ్ చేయాలని, తాగునీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రెండు పడక గదుల పెండింగ్ పనులు పూర్తిచేసి సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. మండలంలో పెండింగ్ లో ఉన్న 2 అంగన్వాడీ భవనాలు, లింక్ రోడ్లు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలోపంచాయతీ రాజ్ ఈఈ వెంకట్ రెడ్డి, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ అశోక్, ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి, డీఈ మహేష్, ఏఈ చిరంజీవి, ఏఓ, ప్రజా ప్రతినిధులు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్ బీ అధికారులు, అధికారులు పాల్గొన్నారు.