వృథా అయిన ప్రజాధనం.. అక్షరాల రూ.5 లక్షలు

వైరా మున్సిపాలిటీలో ఇద్దరు ఉద్యోగులకు నెలల తరబడి బాధ్యతలు

Update: 2025-03-19 03:55 GMT
వృథా అయిన ప్రజాధనం.. అక్షరాల రూ.5 లక్షలు
  • whatsapp icon

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీలో ఇద్దరు ఉద్యోగులకు నెలల తరబడి బాధ్యతలు అప్పగించకపోవడంతో ప్రజాధనం సుమారు రూ. 5 లక్షలు వృధా అయ్యింది. మున్సిపల్ కమిషనర్ నిర్వాకం వల్ల ఆ ఇద్దరు ఉద్యోగులు నిత్యం కార్యాలయానికి వచ్చి ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. కమిషనర్ బాధ్యతలు అప్పగించని ఆ ఇద్దరు ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తోంది. నిత్యం విధులకు హాజరయ్యే ఆ ఉద్యోగులకు కార్యాలయంలో ఎలాంటి పని కేటాయించకపోవడం చర్చనియాంశమైంది. మరోవైపు ఇద్దరు జూనియర్ అకౌంటెంట్లు ఉన్నప్పటికీ వారి విధులను ఇంజనీరింగ్ శాఖలోని ఓ జూనియర్ అసిస్టెంట్ తో కమిషనర్ అనధికారికంగా చేయించటం విశేషం.

వైరా మున్సిపాలిటీకి జూనియర్ అకౌంటెంట్లుగా గత ఏడాది జూలైలో ఆశాకుమారి , డిసెంబర్ చివరలో సుధీర్ లను ప్రభుత్వం నియమించింది. ఖమ్మం కార్పొరేషన్లో 10 ఏళ్ల పాటు పనులు చేసిన డెఫ్ అండ్ డం ఉద్యోగిని ఆశా కుమారి అక్కడ అధికారుల ప్రశంసలు పొందింది. అయితే ఆమెకు ఎలాంటి ఉద్యోగ బాధ్యతలు అప్పగించకుండా 8 నెలలుగా కార్యాలయంలో ఖాళీగా ఉంచుతున్నారు. నిత్యం ఆమె ఉదయం 10:30 గంటలకు కార్యాలయానికి వచ్చి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్తున్నారు.

ఈమెకు ప్రభుత్వం నెలకు అక్షరాల 54 వేల రూపాయల జీతాన్ని చెల్లిస్తుంది. మరో జూనియర్ అసిస్టెంట్ సుధీర్ కూడా ఎలాంటి పనులు కేటాయించలేదు. ఆయనకు ప్రభుత్వం నెలకు సుమారు 25 వేల రూపాయల జీతాన్ని చెల్లిస్తుంది. 8 నెలలుగా ఆశాకుమారికి, మూడు నెలలుగా సుధీర్ కు ప్రభుత్వం చెల్లిస్తున్న సుమారు 5 లక్షల రూపాయల నగదు దుర్వినియోగం అయినట్లు అయింది. ప్రజల వద్ద పన్నుల రూపంలో వసూలు చేసిన ప్రభుత్వ సొమ్మే కదా పోతే పోనీ అన్న చందాగా కమిషనర్ వ్యవహరిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఖమ్మంలో విధులు నిర్వహించిన ఆశా కుమారి అంగవైకల్యాన్ని అడ్డుపెట్టి కనీస బాధ్యతలు అప్పగించకపోవడం వెనక్కున్న ఆంతర్యమేమిటో అధికారులకే తెలియాలి.

కార్పొరేషన్ లో 10 సంవత్సరాలు పని చేసిన ఆమె మున్సిపాలిటీలో విధులు నిర్వహించలేని స్థితిలో ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కనీస సమయపాలన పాటించని, తన ఇష్టారాజ్యంగా విధులకు ఎగనామం పెట్టే ఓ జూనియర్ అసిస్టెంట్ కు అకౌంటెంట్ బాధ్యతలు అనధికారికంగా అప్పగించటం మున్సిపాలిటీ వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల కార్యాలయంలో ఓ అధికారి హోలీ వేడుకలు నిర్వహించి మహిళా ఉద్యోగుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని కార్యాలయంలోని ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు.

మహిళా ఉద్యోగినిలకు రంగులు పూసి వారితో బలవంతంగా అధికారి రంగులు చెల్లించుకున్నారని మున్సిపాలిటీ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. ఈ సన్నివేశాలను తన కెమెరాలో తప్ప ఇతర కెమెరాల్లో బంధించొద్దని సిబ్బందిని కూడా ఆ అధికారి ఆదేశించారట. ఈ విషయాన్ని ఓ ఉద్యోగిని బంధువులు దిశ దృష్టికి తీసుకురావడం విశేషం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైరా మున్సిపాలిటీలో ప్రజాధనం దుర్వినియోగం తో పాటు ఇతర వ్యవహారాలపై విచారణ నిర్వహించాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.


Similar News