సదరన్ క్యాంప్ లో దివ్యాంగులకు అవసరమైన వసతుల కల్పన
సదరం క్యాంప్ నిర్వహణ సమయంలో దివ్యాంగులకు అవసరమైన వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

దిశ, ఖమ్మం : సదరం క్యాంప్ నిర్వహణ సమయంలో దివ్యాంగులకు అవసరమైన వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సదరం క్యాంప్ ల కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రి వద్ద చేయవలసిన ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, శిక్షణ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు అందించే యు.డి.ఐ.డి. కార్డులు మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఉపయోగపడతాయని, నూతనంగా యు.డి.ఐ.డి. కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్ష కోసం సదరం స్లాట్ బుకింగ్ చేసి సమాచారం అందించాలని అన్నారు. దివ్యాంగులు నిర్ధారణ పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు వారికి అవసరమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆసుపత్రిలో వికలాంగత్వం నిర్ధారణ కోసం అవసరమైన వైద్యులు, పరికరాలు ఉండేలా చూడాలని, క్యాంపు సమయంలో దివ్యాంగులకు రిసెప్షన్ సెంటర్, కుర్చీలు, నీడ కోసం ఏర్పాటు, త్రాగునీరు, టాయిలెట్స్, ర్యాంప్ వంటి వసతులు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సన్యాసయ్య, జిల్లా సంక్షేమ అధికారి కె. రామ్ గోపాల్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, డా. రాంబాబు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.