విద్యా ఆవశ్యకత పై అసెంబ్లీలో పాట పాడిన : ఎమ్మెల్యే జారె

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రసంగించారు

Update: 2025-03-25 15:31 GMT
విద్యా ఆవశ్యకత పై అసెంబ్లీలో పాట పాడిన : ఎమ్మెల్యే జారె
  • whatsapp icon

దిశ, అశ్వారావుపేట: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రసంగించారు. మంగళవారం బడ్జెట్ సెషన్ లో భాగంగా ఎమ్మెల్యే జారె మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2025-2026 బడ్జెట్లో రూ.23 వేల 108 కోట్లు కేటాయించడం పట్ల తెలంగాణ విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు.. పసి పిల్లల చదివే దానికి విత్తు.. అనే పాట పాడి విద్య ఆవశ్యకతను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలలు 1023 కి పెరిగినప్పటికీ.. నేటికీ సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రూ.200 కోట్లతో 25 ఎకరాల సువిశాల ప్రాంగణంతో నిర్మించబడుతున్నాయని, ఇందులో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య బోధన ఉండబోతుందని తెలిపారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చడానికి విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసి అధ్యయనం చేయనున్నారు. 2021 నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారం తెలంగాణ విద్యార్థులు నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ప్రావీణ్యం కలిగి ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీచర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు కల్పించడంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని మెరుగైన సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా ఉన్నాయని.. వాటిని అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం అందించవచ్చు అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని.. పదోన్నతులు కల్పించాలని కోరారు.


Similar News