వైరా మున్సిపాలిటీ కమిషనరా.. మజాకా!

అస్తవ్యస్తంగా ఉన్న వైరా మున్సిపాలిటీను సక్రమ మార్గంలో పెట్టేందుకు కృషి చేస్తున్నానని పదే పదే చెప్తున్నా మున్సిపాలిటీ కమిషనరే పక్కదారి పట్టారు.

Update: 2023-03-14 03:31 GMT

దిశ, వైరా: అస్తవ్యస్తంగా ఉన్న వైరా మున్సిపాలిటీను సక్రమ మార్గంలో పెట్టేందుకు కృషి చేస్తున్నానని పదే పదే చెప్తున్నా మున్సిపాలిటీ కమిషనరే పక్కదారి పట్టారు. సక్రమంగా పని చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ఆ అధికారి నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు డ్రా చేయడం వైరాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మున్సిపాలిటీ కమిషనర్ తన సొంత కారులో తిరుగుతూ ప్రైవేట్ ట్రావెల్స్ కారు పేరుపై ఐదు నెలలుగా బిల్లులు డ్రా చేసిన విషయం ప్రస్తుతం వైరాలో హాట్ ట్రాఫిక్ గా మారింది. నెలకు రూ.33 వేల చొప్పున ఐదు నెలలకు రూ.1.65 లక్షలు ప్రైవేట్ ట్రావెల్స్ కారు పేరుతో అద్దె బిల్లులు డ్రా చేశారు.

వాడేది వైట్ ప్లేట్... ఎల్లో ప్లేట్ కారుపై బిల్లులు చెల్లింపు

వైరా మున్సిపాలిటీ కమిషనర్ తన కుటుంబ సభ్యులకు చెందిన వైట్ ప్లేట్ కారును ఉపయోగిస్తూ ఎల్లో ప్లేట్ కారుపై అద్దె బిల్లులు డ్రా చేయడం విశేషం. Ts04ew1971 నెంబర్ గల వైట్ ప్లేట్ కారును కమిషనర్ ఉపయోగిస్తున్నారు. ఈ కారు భూతరాజు నాగమణి పేరుపై రిజిస్ట్రేషన్ అయింది. గత ఐదు నెలలుగా కమిషనర్ ఈ కారులోనే ప్రయాణిస్తుంది. అయితే ts04ua7613 నెంబర్ గల ఖమ్మం సునీత ట్రావెల్స్ కు చెందిన ఎల్లో ప్లేట్ కారుపై ప్రతినెలా కమిషనర్ అద్దె బిల్లులు డ్రా చేస్తుంది. నెలకు 33 వేల రూపాయల చొప్పున ఇప్పటివరకు ఐదు నెలలు బిల్లులు డ్రా చేసినట్లు సమాచారం.

ప్రభుత్వ నిబంధన ప్రకారం ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మాత్రమే అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్ ప్లేట్ వాహనాలు నాన్ ట్రాన్స్పోర్ట్ కిందకు వస్తాయి. ఓన్ ప్లేట్ ను రెంటుకు తీసుకోవడానికి వీలు లేకపోవడంతో కమిషనర్ ఓన్ ప్లేట్ కార్ లో తిరుగుతున్నప్పటికీ ఖమ్మంలోని సునీత ట్రావెల్స్ కు చెందిన కారుపై అక్రమంగా ప్రతి నెల అద్దె బిల్లులు డ్రా చేస్తున్నారు. మున్సిపాలిటీలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిత్యం కమిషనర్ ఏ కారులో వస్తుందో జిల్లా ఉన్నతాధికారులకు స్పష్టమవుతుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైరా మున్సిపాలిటీలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News