అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ ను గెలిపిద్దాం : ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్
వచ్చే ఎన్నికల్లో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన బావబానోత్ మదన్ లాల్ ను అందరు గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పిలుపునిచ్చారు.
దిశ, వైరా : వచ్చే ఎన్నికల్లో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన బావ బానోత్ మదన్ లాల్ ను అందరు గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ ను బానోతు మదన్ లాల్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ కు బానోత్ మదన్ లాల్ పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేరు వేరు ఆలోచనలు పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వచ్చే వంద రోజులు కష్టపడి పనిచేసి వైరాలో గెలవటమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అందరం కలిసి మెలిసి పనిచేసి వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం అన్నారు. సీఎం కేసీఆర్ గోదావరిలో దూకమన్న తాను దూకుతానని చెప్పారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతకు అనుగుణంగా ఎన్నికల్లో ఇతర పార్టీలను ఓడించేందుకు శక్తికి మించి నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. కాబోయే నియోజకవర్గ రథసారధి తన భావ అని కొనియాడారు. తిధి నక్షత్రాలు చూసుకొని ఆత్మీయంగా తన వద్దకు బావ రావటం సంతోషంగా ఉందని చమత్కరించారు. బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో మొట్టమొదటిసారి బీఆర్ఎస్ గెలవాలంటే రాములు నాయక్ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తనకు టికెట్ కేటాయించిన తర్వాత రాములు నాయక్ కు ఫోన్ చేసి సహాయ సహకారాలు అందించాలని అభ్యర్థించానని చెప్పారు.
బావ మీరు ఏమి భయపడకండి.. నేను ఉన్నాను, నేను వెంట ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తానని, గెలిపిస్తానని రాములు నాయక్ అభయం ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ కుటుంబంలోని నాయకులు, కార్యకర్తలు అందరం భేష జాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాముల నాయక్ ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో వైరాలో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ పరస్పర అలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ కు మదన్ లాల్ శిరస్సు వంచి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.