ఉధృతంగా గోదావరి.. అప్రమత్తమైన అధికారులు..

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం ఉదయం 30.04 అడుగులు ఉన్న గోదావరి, 11 గంటలకు 33.03 అడుగులకు పెరిగి ప్రవహిస్తుంది.

Update: 2024-07-20 11:05 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం ఉదయం 30.04 అడుగులు ఉన్న గోదావరి, 11 గంటలకు 33.03 అడుగులకు పెరిగి ప్రవహిస్తుంది. శనివారం రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం ఏజెన్సీలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఈత వాగు, గుబ్బల మంగి వాగు పొంగి రహదారుల పై ప్రవహిస్తుండడంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దుమ్ముగూడెం మండలం కే.లక్ష్మీపురం వద్ద ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరుకోవడంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి.

భద్రాచలం గోదావరి నుండి దిగువకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు తరలి వెళ్లినట్టు అధికారులు పేర్కొన్నారు. చతిస్గడ్ అటవీ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా, పెద్ద ఎత్తున వరద నీరు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నిండుకోవడంతో 20 గేట్లు ఎత్తి గత 24 గంటల్లో లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదిలారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు గోదావరి ముంపు పరివాహక ప్రదేశాల్లో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags:    

Similar News