వైరాలో వర్గ రాజకీయం..!

ఖమ్మం జిల్లాలో వైరా నియోజక వర్గం ఎప్పుడూ హాట్ టాపికే.

Update: 2023-04-12 15:36 GMT

దిశ బ్యూరో, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో వైరా నియోజక వర్గం ఎప్పుడూ హాట్ టాపికే. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న వైరా నియోజక వర్గంలో అధికార బీఆర్ఎస్ ఎప్పుడూ గెలిచింది లేదు. కానీ.. గెలిచిన వాళ్లంతా తర్వాత ఆ పార్టీలో చేరుతుండడం బీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశం. వైరా నియోజక వర్గాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 2009లో సీపీఐ అభ్యర్థిని డా.బానోతు చంద్రావతి కాంగ్రెస్ కు చెందిన డా.భూక్య రామచంద్రునాయక్ ను ఓడించారు. తర్వాత చంద్రావతి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో వైసీపీ అభ్యర్థి బానోతు మదన్ లాల్ టీడీపీకి చెందిన బానోతు బాలాజీపై గెలిచారు. తర్వాత మదన్ లాల్ గులాబీ గూటికి చేరారు. 2018లో మదన్ లాల్ పై స్వతంత్ర అభ్యర్థి లావుడ్య రాములు నాయక్ విజయం సాధించారు. తర్వాత రాములు నాయక్ కూడా అధికార పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు మొదలయ్యాయి. తమ పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచారన్న భావనతో కొందరు నాయకులు వేరు కుంపటి పెట్టుకున్నారు.

మూడు వర్గాలుగా బీఆర్ఎస్ పార్టీ..

ప్రస్తుతం వైరాలో అధికార పార్టీ మదన్ లాల్, రాములు నాయక్ వర్గాలుగా చీలిపోయింది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పొంగులేటిని అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పొంగులేటి తన అభ్యర్థిని నిలబెడతారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వర్గాలుగా చీలిన అధికార బీఆర్ఎస్ పార్టీలో నాయకులు, కేడర్ ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మరో ఇద్దరు నాయకులు కూడా బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి బహుముఖ పోటీ తప్పదనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈసారి వైరాలో గులాబీ జెండా పాతాలని బీఆర్ఎస్ అధిష్టానం పట్టుదలతో ఉంది. వైరా నియోజక వర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఒకసారి గెలిచిన వారు రెండో సారి గెలవలేదు. ఆ రికార్డును ఇక్కడి ప్రజలు ఈసారి కూడా కొనసాగిస్తారో.. బ్రేక్ చేస్తారో.. చూడాలి.

రోడ్లు, సాగు నీటి ప్రాజెక్టులకు శాశ్వత పరిష్కారం

వైరా నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రోడ్లు, సాగు నీటి ప్రాజెక్టులకు శాశ్వత పరిష్కారం లభించింది. 2011లో వైరా రిజర్వాయర్ తొలి దశ ఆధునికీకరణ పనులను రూ.54 కోట్లతో చేపట్టారు. వైరా-నెమలి, పల్లిపాడు-ఏన్కూరు, పెద్ద మునగాల-తనికెళ్ల, బస్వాపురం-మాణిక్యారం తదితర రోడ్లను అభివృద్ధి చేశారు.

కట్టా కృష్ణార్జునరావు, వైరా మాజీ ఎంపీపీ

సింగరేణి పుట్టినిల్లుకు నిధుల కరువు

సింగరేణి పుట్టినిల్లు అయిన కారేపల్లి అభివృద్ధికి నిధులు కరువయ్యాయి. సింగరేణి లాభాల్లో 25% నిధులు కారేపల్లి మండల అభివృద్ధికి కేటాయించాలి. కానీ రూ.50 లక్షలు మాత్రమే మంజూరు చేశారు. కారేపల్లి రైల్వే జంక్షన్ లో రైళ్ల హాల్టింగ్ లేకపోవడం విడ్డూరం. కారేపల్లి, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు.

ఇందుర్తి సురేందర్ రెడ్డి, సామాజిక కార్యకర్త, కారేపల్లి

వైరా ఓటర్లు... 100% గ్రామీణులే

హిందువులు... 96%

ముస్లింలు... 3%

క్రైస్తవులు... 1%

అక్షరాస్యత... 61%

మండలాలు

కామేపల్లి

ఎంకూరు

కొణిజెర్ల

తల్లాడ

వైరా

2018లో

లావుడ్య రాములు నాయక్.... ఇండిపెండెంట్.... 52,650.... 33.00%

బానోతు మదన్ లాల్.... టీఆర్ఎస్.... 50,637.... 32.00%

2014లో

బానోతు రమేష్.... వైసీపీ.... 59,318.... 40.35%

బానోతు బాలాజీ.... టీడీపీ.... 48,735.... 33.15%

Tags:    

Similar News