ఆయనతో కేసీఆర్ సన్నిహిత సంబంధం.. కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ
సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తో సన్నిహిత సంబంధం కొనసాగించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా.. అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.
దిశ, వైరా: సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తో సన్నిహిత సంబంధం కొనసాగించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా.. అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. గత రెండేళ్లుగా సీఎం కేసీఆర్ భట్టి విక్రమార్క కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో మరో కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పరిపాలనపై, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై నిరంతరం విమర్శలు చేస్తున్నారు. మరోవైపు భట్టి విక్రమార్క.. సీఎంతో సన్నిహిత సంబంధం కొనసాగించడం కాంగ్రెస్ వాదులకు మింగుడు పడటం లేదు.
ఒకవైపు కాంగ్రెస్ వర్గాల్లో, మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. అసలు భట్టి విక్రమార్క అంతర్గత ఆలోచన ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. వీరిద్దరి మధ్య సంబంధాన్ని కాంగ్రెస్ శ్రేణులు శంకిస్తుండగా.. జిల్లాలోని టీఆర్ఎస్ ముఖ్య నేతలకు నిద్ర పట్టకుండా చేస్తోంది. భవిష్యత్తులో భట్టి విక్రమార్క బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తే తమకు వున్న ప్రాధాన్యత తగ్గుతుందా అని జిల్లాలోని ముఖ్య బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది.
సీఎం కేసీఆర్ భట్టి కిచ్చిన ప్రాధాన్యత అంశాలు ఇవే..
సీఎం కేసీఆర్.. భట్టి విక్రమార్క కు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ ను కలిసేందుకు సొంత పార్టీలోని ప్రజాప్రతినిధులు నాయకులకే ప్రగతి భవన్ అపాయింట్మెంట్ లభించడమే అంటే ఆషామాషీ కాదు. అలాంటిది సంవత్సరం క్రితం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో భట్టి కలిసేందుకు అపాయింట్మెంట్ లభించింది. కేసీఆర్ ను భట్టి విక్రమార్క తో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అప్పట్లో కలిశారు.
ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం రేగింది. అనంతరం వెంటనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలుపై ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి భట్టి విక్రమార్క హాజరు కావడంతో పాటు సీఎంపై ఆయన ప్రశంసలు జల్లు కురిపించారు. ఈ విషయం కాస్త కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. అప్పట్లో పార్టీ అనుమతి లేకుండానే భట్టి విక్రమార్క దళిత బంధు సమావేశానికి వెళ్లారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులే బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేసేందుకు రాష్ట్రంలో నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అందులో మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం లోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయటం విశేషం. అంతేకాకుండా గత ఆరు నెలల క్రితం భట్టి విక్రమార్క స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం నుంచి గండగల పాడు వరకు డొంక రోడ్డును బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పీఆర్‌ఆర్ నిధులు 2.15 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
భట్టి విక్రమార్క విజ్ఞప్తి తో ఈ నిధులు మంజూరయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ప్రమేయంతోనే నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు అవుతాయి. కానీ వైరా ఎమ్మెల్యే కు సంబంధం లేకుండా సీఎం కేసీఆర్ భట్టి విక్రమార్క విజ్ఞప్తి మేరకు 2.10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా అనేక అంశాల్లో సీఎం కేసీఆర్ భట్టి విక్రమార్క కు అనేక అంశాల్లో ప్రాధాన్యత ఇచ్చారు.
ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో కాంగ్రెస్‌లో మళ్ళీ రచ్చ..
ఖమ్మం శివారులోని వెంకటాయపాలెం గ్రామంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హాజరుకావటంతో కాంగ్రెస్‌లో మళ్ళీ రచ్చ మొదలైంది. ఈనెల 18వ తేదీన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం తో పాటు ఆ భవనం పక్కనే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను భారీ స్థాయిలో నిర్వహించారు. బీఆర్ఎస్ సభ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
ఇలాంటి వాతావరణంలో సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కలెక్టరేట్ ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ అక్కడే ఉన్న మల్లు భట్టి విక్రమార్క చూసి ఆలింగనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఎంతో ఆప్యాయంగా మా భట్టి విక్రమార్క అంటూ సీఎం కేసీఆర్.. కేరళ సీఎం పినరై విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్‌కు పరిచయం చేశారు.
బీఆర్ఎస్ సభ సందర్భంగా ఒకవైపు జిల్లాలో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం, మరోవైపు బీఆర్ఎస్ సభ జరిగే సమీప ప్రాంతంలోని కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి మల్లు భట్టి విక్రమార్క వెళ్లడం కాంగ్రెసులోనే బహిరంగ విమర్శలకు దారి తీసింది. ఈ విషయం ఇప్పటికీ భట్టి విక్రమార్క పై కొంతమంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అధిష్టానంకు కూడా ఫిర్యాదు చేశారు.
భట్టి విక్రమార్క తో సన్నిహితంగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీని అంతర్గతంగా డైలమాలో పడటమే సీఎం కేసీఆర్ వ్యూహం అనే చర్చ కొనసాగుతోంది. మరోవైపు మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ వ్యవహార శైలితో కంగుతింటున్నారు. తాము నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే కేసీఆర్ భట్టి విక్రమార్క కు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో..? తెలియక ఆ నియోజకవర్గ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.