‘దిశ’ ఎఫెక్ట్.. వృథా అయిన ప్రజాధనం పై స్పందించిన అధికారులు..
వైరా మున్సిపాలిటీ కార్యాలయం లో అకౌంటెంట్ బాధ్యతలు సుధీర్ కు

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ కార్యాలయం లో అకౌంటెంట్ బాధ్యతలు సుధీర్ కు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. సుధీర్ కు అధికారికంగా అకౌంటెంట్ బాధ్యతలు అప్పగించేందుకు అధికారులు ఆగమేఘాల మీద ఆర్డర్ కాపీ రెడీ చేశారు. అంతేకాకుండా డెఫ్ అండ్ డం ఉద్యోగిని ఆశా కుమారిని మానవీయ కోణంలో డిప్యూటేషన్ పై పంపేందుకు రిక్వెస్ట్ లెటర్ ను కూడా సిద్ధం చేశారు. వైరా మున్సిపాలిటీకి గత 8 నెలల క్రితం ఆశాకుమారి, 3 నెలల క్రితం సుధీర్ లను జూనియర్ అకౌంటెంట్లుగా ప్రభుత్వం నియమించింది. అయితే వారికి ఉద్యోగ బాధ్యతలు అప్పగించకుండా కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ విషయమై దిశ వెబ్సైట్ లో మంగళవారం మధ్యాహ్నం "వైరా మున్సిపాలిటీలో డెఫ్ అండ్ డం మహిళకు తీవ్ర అవమానం", బుధవారం ఉదయం "వృధా అయిన ప్రజాధనం... అక్షరాల రూ. 5 లక్షలు" అనే వార్త కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ వార్త కథనాలతో స్పందించిన జిల్లా అధికారులు మున్సిపాలిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆశా కుమారిని మానవీయ కోణంలో డిప్యూటేషన్ పై ఖమ్మం పంపేందుకు వెంటనే తనకు రిక్వెస్ట్ లెటర్ పంపాలని వరంగల్ రీజనల్ డైరెక్టర్ మసూద్ వైరా మున్సిపాలిటీ కమిషనర్ ను ఆదేశించారు. అదేవిధంగా మరో ఉద్యోగి సుదీర్ కు అకౌంటెంట్ గా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారులతో పాటు రీజనల్ డైరెక్టర్ ఆదేశాలతో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మున్సిపాలిటీ అధికారులు ఆగమేఘాల మీద అకౌంటెంట్ గా సుదీర్ ని నియమిస్తూ ఆర్డర్ కాపీ రెడీ చేశారు. ఆశా కుమారి డిప్యూటేషన్ రిక్వెస్ట్ లెటర్ పై కమిషనర్ సంతకం చేశారు. దిశ వెబ్సైట్ లో వరుస కథనాలతో మూడు నెలలుగా ఖాళీగా ఉన్న ఉద్యోగి సుధీర్ ను ఎట్టకేలకు అకౌంటెంట్ గా నియమించారు. ఇదిలా ఉంటే పూర్తిస్థాయిలో సుదీర్ ను అకౌంటెంట్ గా నియమిస్తారా లేక కొన్ని విభాగాలు మాత్రమే అప్పగిస్తారా అనే చర్చ మున్సిపాలిటీ వర్గాల్లో జరుగుతోంది.
ఆ జూనియర్ అసిస్టెంట్ పై అంత ప్రేమ ఎందుకు..?
వైరా మున్సిపాలిటీ లోని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ పై కమిషనర్ తో పాటు మరో అధికారి అంతులేని ప్రేమను వలక పోస్తున్నారు. సంవత్సర కాలంగా అతనిని అనధికారికంగా అకౌంటెంట్ గా నియమించారు. సమయపాలన పాటించకపోవడంతో పాటు విధులకు ఇష్టారాజ్యంగా డుమ్మా కొట్టే సదరు ఉద్యోగస్తుడిని ఎట్టకేలకు అకౌంటెంట్ బాధ్యతల నుంచి తొలగించారు. అయితే ఆయనను మరో బాధ్యతాయుతమైన పోస్టులో కూర్చో పెట్టేందుకు కమిషనర్ తో పాటు ఇక్కడ పనిచేసే ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీన ప్రస్తుతం మున్సిపాలిటీలో ఆర్ఐ గా పనిచేస్తున్న ప్రదీప్ ని తొలగించి అతని స్థానంలో సదరు జూనియర్ అసిస్టెంట్ ను కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని మున్సిపాలిటీ ఉద్యోగులే బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. సామాజిక కోణంలో ఇక్కడ పనిచేసే ఓ అధికారి సదరు జూనియర్ అసిస్టెంట్ ను అందలం ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.