దిశ, మణుగూరు: అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు దిక్కు ఎవ్వరని కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని తాటి గూడెం గ్రామ పంచాయతీలోని గాంధీనగర్ గ్రామాన్ని ఆయన సందర్శించారు. అలాగే మిర్చి పంట దెబ్బతిన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ..అకాలవర్షాల వల్ల మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న పంటలకు..రైతులకు దిక్కు ఎవరు అని ప్రశ్నించారు. రైతులు కష్టపడి పండించిన మిర్చిపంటలు చేతికి రాకపోవడంతో రైతులు కుదేలవ్వుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందా..చేయదా.. అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. వెంటనే ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారం అందించి, రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా లు, రాస్తారోకోలు చవిచూడాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పుకోచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రామటెంకి మోహన్ రావు, చందా శ్యాంసుందర్, జిమ్మిడి ప్రకాష్, జాడి రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.