సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే రాములు నాయక్

కేంద్ర ప్రభుత్వం అనునిత్యం నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ విమర్శించారు.

Update: 2023-03-01 16:01 GMT

దిశ, వైరా : కేంద్ర ప్రభుత్వం అనునిత్యం నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ ధర గతం కంటే మూడు రెట్లు పెంచిందని ధ్వజమెత్తారు. 2014 ముందు 14.2 కిలోల గ్యాస్ బండ ధర 350 నుంచి 400 రూపాయలు ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అనేకసార్లు వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిందని ఆరోపించారు. గతంలో 350 నుంచి 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ప్రస్తుతం 1100 రూపాయలు దాటిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధర పెరగడంతో సామాన్యులు జీవించే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. గ్యాస్ ధరలు పెరగటంతో గ్రామాల్లో పురాతన రోజులు పునరావృతం అవుతున్నాయని స్పష్టం చేశారు. గతంలో లాగా ప్రస్తుతం గ్రామాల్లో గ్యాస్ సిలిండర్లను కొనలేక ప్రజలు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పెంచిన గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

    గ్యాస్ ధరలు పెరుగుదలతో మహిళలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను రోజు రోజుకు పెంచుకుంటూ పోవడంతో ఆ ధరల ప్రభావం నిత్యావసర వస్తువుల పై పడుతుందన్నారు. డీజిల్ ధరల పెరుగుదలకు అనుగుణంగా నిత్యావసర వస్తువు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు కడుపునిండా తినలేక, ఏది కొనలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కేవలం మతంతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రజలపై పెనుభారాలను మోపటమే పనిగా పెట్టుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తాను చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకునేందుకు దేశవ్యాప్తంగా మతవిద్వేషాన్ని రెచ్చగొడుతుందని ఆరోపించారు. మూడు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరతో పాటు, కమర్షియల్ గ్యాస్ బండల ధరలను పెంచి తన నిజ స్వరూపాన్ని మరోసారి నిరూపించుకుందన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News