దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ : Minister Harish Rao

18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

Update: 2023-01-16 12:22 GMT

దిశ, ఖమ్మం బ్యూరో : 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. సోమవారం ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ సభకు సంబంధించి పలు విషయాలను తెలిపారు. 18న జరిగే ఖమ్మం సభ చారిత్రకమని, దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ అన్నారు. వంద ఎకరాల్లో బహిరంగ సభ జరుగుతుందని, పార్కింగ్ 448 ఎకరాల్లో 20 చోట్ల ఏర్పాటు చేశామన్నారు. వెయ్యి మంది వలంటీర్లు సభలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నియోజక వర్గాల వారీగా ఇన్చార్జి లను నియమించి జన సమీకరణ చేస్తున్నామని, 13 నియోజకవర్గాల నుంచి ఎక్కువ జన సమీకరణ చేస్తున్నామని తెలిపారు. సభకు వాహనాలు దొరకడం లేదని, పక్క రాష్ట్రాల నుంచి బస్సులు, వాహనాలు సమకూరుస్తున్నామన్నారు. ముఖ్య అతిథులతో పాటు ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు వేదికపై ఉంటారని చెప్పారు. రేపు రాత్రికి ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకుంటారని, ఎల్లుండి 18న ఉదయం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ముగ్గురు ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు చర్చలు జరుపుతారన్నారు. యాదాద్రి దర్శనం చేసుకొని.. రెండు హెలికాప్టర్లలో ఖమ్మం చేరుకుంటారని వివరించారు. నూతన కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఖమ్మం కలెక్టరేట్ లో రెండవ విడత కంటి వెలుగు ప్రారంభిస్తారని, కంటి వెలుగు ప్రారంభం తర్వాత కలెక్టరేట్ లో నలుగురు ముఖ్యమత్రులు భోజనం చేస్తారన్నారు. సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుందని, కళాకారులకు ప్రత్యేక వేదిక ఉంటుందని చెప్పారు. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సభకు సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు కూడా హాజరుకానున్నట్లు తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం నుంచే 3 లక్షల మంది... 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నుంచే దాదాపు 3 లక్షల మంది హాజరు కానున్నారని, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నియోజకవర్గాలను మినహాయించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తరువాత నిర్వహించే తొలి బహిరంగ సభ ఖమ్మం లో ఏర్పాటు చేయడం గర్వంగా ఉన్నదని, అందుకు సీఎం కేసీఆర్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం బోర్డర్ జిల్లా కావడంతో ఏపీ, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ప్రజలు హాజరవుతున్నట్లు వెల్లడించారు. సమీకృత కలెక్టరేట్, కంటివెలుగు ప్రారంభం అనంతరం మెడికల్ కాలేజీ ఫౌండేషన్ స్టోన్ కూడా సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. మంత్రి హరీశ్ రావు పర్యవేక్షణలో బహిరంగ సభ నిర్వహణ జరుగుతుందని, ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

Tags:    

Similar News