ప్రమాదాలు జరిగేదాకా పట్టించుకోరా..?
హైదరాబాద్, దేవరపల్లి జాతీయ రహదారిపై తల్లాడ మీదగా
దిశ,తల్లాడ: హైదరాబాద్, దేవరపల్లి జాతీయ రహదారిపై తల్లాడ మీదగా వందలాది వాహనాలతో పాటు భారీ వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తల్లాడ ఎన్టీఆర్ కాలనీ వద్ద రోడ్డుకు ఇరువైపులా బెల్ట్ షాపులు, హోటల్ ఉండటంతో ఇక్కడ నిరంతరం లారీలు ఇతర వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలుపుదల చేయడం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ షాప్ ముందు లారీ నిలిపి ఉండటంతో తిరువూరు కు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న కారు పొదల్లోకి దూసుకెళ్లి ప్రమాదం అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. అదే విధంగా గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎన్టీఆర్ కాలనీ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది లారీలు నిలుపుదల చేయటంతో బస్సులు, ఆటోలు ఆగక కాలినడకనే తల్లాడకు రాకపోకలు చేయాల్సి వస్తుంది.
కాలనీలో చదువుతున్న పిల్లలు ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుతున్నారు. స్కూలుకు వెళ్లే వచ్చేటప్పుడు లారీలు ఉండటంతో పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రైవేట్ స్కూల్ లో చదివే పిల్లలకు బస్సులు వచ్చే అవకాశం లేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వెంట ఉన్న బెల్ట్ షాపులు వద్ద లారీ డ్రైవర్లు ఇతర వాహనాలు ఇష్టం వచ్చిన రీతిలో నిలుపుదల చేసి మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటంతో అశ్వరావుపేట వరకు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదం జరిగి ప్రయాణికుల ప్రాణాలు పోకముందే తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.