రైల్వే లైన్లను మార్చండి
పాలేరు నియోజకవర్గ అన్ని మండలాల్లోని సారవంతమైన భూముల్లోంచి, స్తంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) అతి ఖరీదైన స్థలాల్లోంచి వెళ్లేలా ప్రతిపాదించిన డోర్నకల్ - మిర్యాలగూడ, గద్వాల రైల్వే లైన్ తో ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని.. లైన్ ను కచ్చితంగా మార్చాల్సిందేనని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ను కోరారు.
దిశ, ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గ అన్ని మండలాల్లోని సారవంతమైన భూముల్లోంచి, స్తంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) అతి ఖరీదైన స్థలాల్లోంచి వెళ్లేలా ప్రతిపాదించిన డోర్నకల్ - మిర్యాలగూడ, గద్వాల రైల్వే లైన్ తో ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని.. లైన్ ను కచ్చితంగా మార్చాల్సిందేనని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ను కోరారు.
ఢిల్లీలో గురువారం రైల్వే ప్రధాన కార్యాలయంలో ఆయనను కలిసి.. ఈ మేరకు విన్నవించారు. డోర్నకల్ నుంచి వయా పాపడ్ పల్లి - జాన్ పహాడ్ ( మిర్యాలగూడ), అలాగే డోర్నకల్- గద్వాల రైల్వే లైన్లు పూర్తిగా పాలేరు నియోజకవర్గం మీదుగా వెళ్లనుండడంతో.. ఈ ప్రాంత వాసులకు తీరని నష్టం చేకూరుతుందని అన్నారు. రైతులు సారవంతమైన భూముల్ని కోల్పోతారని తెలిపారు.
ప్రత్యామ్నాయ రైల్వే లైనే ఉత్తమం
ఖమ్మంలో అదనంగా మూడో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి దశకు వచ్చిందని.. ఇక్కడికి ఆరు జాతీయ రహదారులతో అనుసంధానం ఉందని.. ఈ ప్రాంతంలో కొత్తగా రైల్వే లైన్ తో ప్రజలను తీవ్రంగా నష్టపరచడం కంటే.. ప్రత్యామ్నాయ మార్గం చూడటమే ఉత్తమమని ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సూచించారు. కొత్త లైన్ పూర్తిగా పాలేరు నియోజకవర్గంలోంచే వెళ్తుండడంతో ఇక్కడ భూముల సేకరణకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని, భారీ వ్యయంతో కూడిందని తెలిపారు. ప్రత్యామ్నాయంగా సూచిస్తున్న డోర్నకల్- వయా వెన్నారం, మన్నెగూడెం, మరిపెడ, మోతె మీదుగా కొత్త లైన్ నిర్మించాలని సూచించారు.
మరిపెడ.. మోతె మీదుగా అయితే దూరం, వ్యయభారం తగ్గుతాయి..
డోర్నకల్- మిర్యాలగూడ(జాన్ పహాడ్) నూతన రైల్వే లైన్ ను పాలేరు నియోజకవర్గం మీదుగా కాకుండా ప్రత్యామ్నాయంగా వెన్నారం..మన్నెగూడెం, మరిపెడ, మోతే మీదుగా నిర్మిస్తే మొత్తం 124 కిలోమీటర్ల నుంచి 19 కి. మీ. దూరం తగ్గుతుందని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్ కు వివరించారు. అలాగే భూ సేకరణ వ్యయం బాగా తగ్గి.. ఇటు లైన్ నిర్మాణ ఖర్చుకు సంబంధించి ప్రభుత్వానికి, రైల్వేకు కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని తెలిపారు.
పాలేరుకు బదులు.. ప్రత్యామ్నాయ రైల్వే మార్గం చూస్తాం : హామీ ఇచ్చిన రైల్వే బోర్డు చైర్మన్
ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ఇచ్చిన వినతి, పాలేరు నియోజకవర్గంలో వందలాదిమంది ఇబ్బంది పడుతున్నారన్న వివరణతో రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీష్ కుమార్ స్పందించారు. తీవ్రంగా నష్టపరచనున్న కొత్త రైల్వే లైన్ పై పాలేరు నియోజకవర్గ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఎంపీ సుదీర్ఘంగా, సవివరంగా తెలియజేయడంతో రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఇంతకుముందు అనుకున్న లైన్ పై పున: పరిశీలన చేస్తామని అన్నారు. కచ్చితంగా ఈ లైన్ కు బదులు ప్రత్యామ్నాయంగా ఎంపీ సూచిస్తున్న.. డోర్నకల్ - వెన్నారం, మన్నెగూడెం, మరిపెడ, మోతె మీదుగా కొత్త రైల్వే లైన్ ను నిర్మిస్తామని అభయమిచ్చారు.