ఖమ్మం జిల్లాలో 10కి పది స్థానాలు బీఆర్ఎస్ వే :ఎమ్మెల్సీ తాత మధు
ఖమ్మం జిల్లాలో 10కి పది స్థానాలు గెలిచి తీరుతామని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు అన్నారు.
దిశ, కూసుమంచి : ఖమ్మం జిల్లాలో 10కి పది స్థానాలు గెలిచి తీరుతామని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. బుధవారం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు గ్రామంలో ఈనెల 27న ప్రజా ఆశీర్వాద సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పరిపాలించిందని, అప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిందని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆనాడే తెలంగాణ రాష్ట్ర ఇచ్చి ఉండుంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించేది కాదని అన్నారు. కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత 1200 మంది బలి తీసుకున్నారని, కనీసం అప్పుడు తెలంగాణ ఇచ్చిన ఆత్మ బలిదానాలు తగ్గేవని దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని విమర్శించారు. ఈనాడు తుమ్మల, పొంగులేటి మాట్లాడుతున్నట్లుగా అవినీతి ప్రభుత్వంగా ఏర్పడిందని అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వం వహించింది మీరు కాదా అని దుయ్యబట్టారు. మీ మనుగడ కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం, పదవీకాంక్ష కోసం పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు చేయడం మీ సంస్కారాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు మీ మాయ మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని, విజ్ఞులైన ఖమ్మం ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ..ఎలక్షన్ ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పాలేరు లోనే మొదట పాల్గొంటారని, సభకు హాజరయ్యే ప్రజలకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని, పాలేరు ఏరియా అభివృద్ధి చెందాలనేదే తన కోరిక అని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు గా తీసుకుని పాలేరు నియోజకవర్గం మొత్తం దళిత బంధు ఇవ్వాలని ముఖ్యమంత్రి ని కోరానని అన్నారు. అన్ని సర్వేలో బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందని, అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేశామని, వచ్చే జూన్ నాటికి అన్ని గ్రామాల్లో అంతర్గత రహదారులు, ఎన్నికల అనంతరం వెంకటాయపాలెం మండలం చేస్తామని, ప్రజలకు ఎవరి మీదైతే నమ్మకం ఉందో వారికి ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వర ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, ఖమ్మం రూరల్ బెల్లం వేణు, రామ సాయం బాలకృష్ణారెడ్డి, మహమ్మద్ ఆసిఫ్ పాషా, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.