లొంగిపోయిన మావోయిస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అడవిరామారం గ్రామానికి చెందిన మావోయిస్ట్‌ పార్టీలో పనిచేస్తున్న ఏటూరునాగారం మహదేవపూర్‌ ఏరియా కమిటీ మావోయిస్టు దళసభ్యుడు మంగళవారం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Update: 2024-10-01 13:26 GMT

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అడవిరామారం గ్రామానికి చెందిన మావోయిస్ట్‌ పార్టీలో పనిచేస్తున్న ఏటూరునాగారం మహదేవపూర్‌ ఏరియా కమిటీ మావోయిస్టు దళసభ్యుడు మంగళవారం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఎస్పీ రోహిత్‌ రాజు తన కార్యాలయంలో లొంగిపోయిన మావోయిస్టు వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గడ్‌ రాష్ట్రం, సుకుమ జిల్లా కరిగుండెం గ్రామం చింతగుప్పకు చెందిన మడకం ఇడుమయ్య అలియాస్‌ మహేష్‌ (22) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండలం అడవిరామారం గ్రామామానికి 15 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం వలస వచ్చాడని ఎస్పీ చెప్పారు. అడవిరామారంలో 3వ తరగతి వరకు చదువు పూర్తి చేశాడని, చాలా సంవత్సరాలు వ్యవసాయ కూలీగా పనిచేసిట్లు పేర్కొన్నారు.

    2023 జనవరి 30న తన అడవిరామారంలో సోదరుడు పునేం ఇడుమయ్యతో కలిసి టీఎస్‌ఎంసీ రామోదర్‌ సమక్షంలో మావోయిస్ట్‌ పార్టీలో సభ్యుడిగా చేరాడని, భద్రతా బలగాలపై చేసిన వివిధ దాడుల్లో పాల్గొన్నాడని వివరించారు. నిషేధిత సీపీఐ మావోయిస్ట్‌ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి వెంకన్నకు గార్డ్‌గా పనిచేసినట్టు తెలిపారు. మావోయిస్ట్‌ పార్టీకి చెందిన నాయకులు, దళసభ్యులు ఆదివాసీ ప్రజలను బెదిరిస్తూ, అమాయక యువకులను, మైనర్‌ బాలబాలికలను మిలీషియా, దళాల్లో బలవంతంగా చేర్చుకుంటూ ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వెల్లడించారు.

    ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మావోయిస్ట్‌ పార్టీకి ఎవరూ సహకరించవద్దని ఎస్పీ కోరారు. లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా లేదా స్వయంగా సమీప పోలీస్‌ స్టేషన్లో లేదా జిల్లా ఉన్నతాధికారులతో సంప్రదించాలని సూచించారు. లొంగిపోయే దళసభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అనేకమంది లొంగిపోయినట్టు ఎస్పీ వివరించారు. 

Tags:    

Similar News