పేదరికమే గీటురాయిగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక

పేద ప్రజల సొంతింటి కల ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో తీరుతుందని, పేదరికమే గీటురాయిగా ఎంపిక ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-21 10:57 GMT

దిశ, కల్లూరు : పేద ప్రజల సొంతింటి కల ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో తీరుతుందని, పేదరికమే గీటురాయిగా ఎంపిక ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి శనివారం భూమి పూజను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తో కలిసి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పేదవాడి చిరకాల సొంత ఇల్లు కోర్కెను తీర్చడానికి ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విడతల వారీగా నాలుగు లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఇందిరమ్మ మోడల్ హౌస్ ని ప్రతి మండలంలో నిర్మిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

    రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలనలో కోటి ఐదు లక్షల అప్లికేషన్స్​ రాగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 80 లక్షల మంది అప్లై చేశారన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం 17,734 మందిని ఆన్లైన్ యాప్ ద్వారా వివరాలను సేకరించగా మిగతా వారివి త్వరలోనే సేకరించి సర్వే పూర్తయిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. అలాగే సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 63 వేల ఇళ్లు ఇస్తే సత్తుపల్లి నియోజకవర్గంలో 537 ఇళ్ల నిర్మాణం చేపట్టగా అవి అసంపూర్తిగానే నిలిచిపోయాయని తెలిపారు.

    కేసీఆర్ కు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కు పరిమితమవుతున్నాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు బీఆర్ఎస్ నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో ధరణి పోర్టల్ తో అభద్రతాభావం ఉండేదని, భూ భారతి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరుగుతందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దయానంద విజయ్ కుమార్, కల్లూరు ఆర్డీఓ రాజేందర్ గౌడ్, స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


Similar News