అడ్డగోలుగా టింబర్ డిపోలకు టేకు దుంగల సరఫరా

సాధారణంగా ఓ రైతు... ఒకటో, రెండో చెట్లను తన సొంత వ్యవసాయ భూముల్లో ఉన్న వాటిని తన అవసరాల నిమిత్తం నరికితే నానా హంగామా చేస్తారు అధికారులు.

Update: 2024-12-30 14:43 GMT

దిశ, మయూరి సెంటర్ : సాధారణంగా ఓ రైతు... ఒకటో, రెండో చెట్లను తన సొంత వ్యవసాయ భూముల్లో ఉన్న వాటిని తన అవసరాల నిమిత్తం నరికితే నానా హంగామా చేస్తారు అధికారులు. అలాంటిది ఖమ్మం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలో సామిల్ టింబర్ డిపోలకు టేకు కర్ర అనధికారికంగా ఎలాంటి అనుమతి లేకుండా నెలలో పదుల సంఖ్యలో తరలిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా పరిధిలో అటవీ శాఖ ఖమ్మం, సత్తుపల్లి డివిజన్లు కలిగి ఉంది. వీటిలో నాలుగు రేంజ్ లను కలిగి ఉంది. వీటిలో ప్రధానంగా మధిర, ఖమ్మం, కూసుమంచి, కారేపల్లి ఉన్నాయి. ఈ నాలుగు ఫారెస్ట్ రేంజ్ అధికారుల పరిధిలో మధిర, కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ లకు కలిపి ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉండగా, కూసుమంచి, ఖమ్మం డివిజన్లకు ఒక్కొక్క అధికారి విధులు నిర్వహిస్తున్నారు.

    ప్రధానంగా ఖమ్మం డివిజన్ పరిధిలో ఉన్న సామిల్ టింబర్ డిపోలకు వివిధ డివిజన్లో నుంచి అరకొర అనుమతులు తీసుకొని ఖమ్మం సామిల్ టింబర్ డిపో యజమానులు జీరో దందా నిర్వహిస్తున్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా రైతు తన సొంత వ్యవసాయ భూమిలో ఉన్న టేకు చెట్లను సామిల్ టింబర్ డిపోలకు అమ్మాలనుకుంటే ముందుగా స్థానిక ఎమ్మార్వో నుంచి ఎన్వోసీ తీసుకొని, స్థానిక అటవీ శాఖ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కు తెలియజేసి, రేంజ్ అధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సదరు రైతు సమర్పించిన దరఖాస్తును పరిశీలించి డీఎఫ్ ఓ అనుమతులతో చెట్లు నరుకుటకు రేంజ్ ఆఫీసర్ పర్మీషన్ ఇస్తారు. రేంజ్ ఆఫీసర్ పర్మీషన్ ఇచ్చే ముందు చెట్టు పరిమాణం, చుట్టుకొలత, పొడవు, వెడల్పు (G/4)2×L)ను ఫారెస్ట్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం సంబంధిత రైతు నుంచి సీఎంటీ (CMT) ప్రకారం అనుమతులు ఇస్తారు. ఇలా వివిధ డివిజన్లో తక్కువ చెట్లకు పర్మీషన్ తీసుకుని ఎక్కువ చెట్లను నరుకుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సామిల్ డిపోల యూనియన్ పేరుతో దందా...

ఖమ్మం ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధిలో సుమారు 54 టింబర్ డిపోలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ టింబర్ డిపోలకు తరలించే టేకు కర్రను, అరకొర అనుమతులతో... ఇష్టాను రీతిలో అధిక మొత్తంలో టేకు కర్ర దుంగలను టింబర్ డిపోలకు తరలిస్తున్నట్టు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం టింబర్ డిపోల యూనియన్లో ప్రధాన భూమిక ఉండి, కీలక పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తి అడ్డగోలుగా పర్మీషన్ లేకుండానే, అధికారులతో అంటగాగి టేకు కర్రను డిపోలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివలన ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది టింబర్ డిపో యాజమానులు సోమవారం అక్రమంగా టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ఖమ్మం శాఖ అధికారులు ఓ టింబర్ సామిల్ డిపోలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

తనిఖీలు నిర్వహిస్తున్నాం : బి. నాగేశ్వరరావు, ఖమ్మం రేంజ్ అటవీ శాఖ అధికారి




 


ఖమ్మం అటవీశాఖ రేంజ్ పరిధిలో ఉన్న పలు సామిల్ టింబర్ డిపోలపై ఆరోపణ వస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. అధికారుల నుంచి పర్మీషన్లు తీసుకున్న కర్ర కంటే సామిల్ టింబర్ డిపోలో స్టాక్ ఎక్కువ ఉంటే ఆ డిపో యాజమానులపై చర్యలు తీసుకుంటాం.


Similar News