ప్రజారోగ్యంపై ప్రభుత్వం పటిష్టమైన చర్యలు

భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ప్రజారోగ్యం విషయమై ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.

Update: 2024-09-10 13:15 GMT

దిశ, ఖమ్మం : భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ప్రజారోగ్యం విషయమై ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో వచ్చే 15 రోజుల్లో డెలివరీ అంచనా తేదీ ఉన్న గర్భిణులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గర్భిణులతో ప్రతిరోజూ టచ్ లో ఉండి, వారి ఆరోగ్య విషయమై సలహాలు సూచనలు చేస్తూ సాధారణ ప్రసవాలని చేపట్టాల్సిన చర్యలపై వారికి అవగాహన కల్పించారు. జిల్లాలో వచ్చే 15 రోజుల్లో 444 మంది గర్భిణులకు డెలివరీ చేయాలని అంచనాలున్నట్లు గుర్తించి, వారిపట్ల ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

    ప్రస్తుత వరదల సందర్భంలో ఈ గర్భిణీల్లో 7 మంది డెలివరీలు జరిగాయన్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది 108, 104 వాహనాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి ప్రసవాలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. అంచనా డెలివరీ తేదీ ఉన్న గర్భిణులు సమయానుసారంగా వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది సలహాలు, సూచనలు పాటించాలని ఆయన అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 896 వైద్య బృందాలతో 2,96,642 కుటుంబాలను సందర్శించి 10,45,774 మంది ఆరోగ్య సర్వే చేశామన్నారు.

     ఇందులో 9,299 మందికి జ్వరం, 379 మందికి డయేరియా ఉన్నవారికి చికిత్స అందించామన్నారు. 65,832 మందికి మందులు అందించినట్లు, 510 మందికి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ప్రత్యేక వైద్య శిబిరాలు, ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందిస్తున్న వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. 

Tags:    

Similar News