గంజాయిపై ఉక్కు పాదం
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపామని, దాంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, భవిష్యత్తులో కూడా గంజాయి రవాణా జరగకుండా కృషి చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.
దిశ, కొత్తగూడెం రూరల్ : గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపామని, దాంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, భవిష్యత్తులో కూడా గంజాయి రవాణా జరగకుండా కృషి చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల యువత తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల రవాణాను కట్టడి చేస్తేనే యువత భవిష్యత్ బాగుంటుందనే ఉద్దేశంతో గంజాయి సరఫరా పై ఉక్కు పాదం మోపినట్లుగా స్పష్టం చేశారు. గంజాయి రవాణా అడ్డుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భద్రాచలంలో ఓ శాశ్వత చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎస్సై ను నియమించామన్నారు. ఉత్తర భారత దేశానికి ఇటు నుండే గంజాయి సరఫరా అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 106 కేసుల్లో 8 వేల కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో తొలిసారి నార్కోటిక్స్ విభాగంలో జాగిలానికి శిక్షణ ఇచ్చామని, దాని ద్వారా అనుమానితుల ఇళ్లలో వాహనాల్లో తనిఖీలు చేసి కేసులు పెడుతున్నామన్నారు. ప్రతి స్టేషన్ వారీగా గంజాయి వాడే వాళ్లని, రవాణా చేసే వాళ్లను గుర్తించి నిరంతరం నిఘా పెట్టామన్నారు. భద్రాద్రి జిల్లాను చూసి మిగతా జిల్లాల్లో కూడా పోలీసు జాగిలాన్ని ఇందుకు వాడుతున్నారన్నారు. ఇప్పటి వరకు 36 వేల గంజాయిని ఆరు విడతల్లో ధ్వంసం చేశామన్నారు. దీని విలువ రూ.90 కోట్లు ఉంటుందన్నారు.
అదే విధంగా మావోయిస్టు కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపినట్లుగా చెప్పారు. మావోయిస్టుల కార్యకలాపాలపై పూర్తి దృష్టి పెట్టామని మొత్తం 59 మంది అరెస్టు అయ్యారన్నారు. ఇందులో దళ సభ్యులు, కొరియర్లు, సానుభూతిపరులు, స్పెషల్ జోనల్ కమిటీ మిలీషా సభ్యులు ఉన్నట్లుగా చెప్పారు. శాంతి భద్రత విషయంలో అనేక విజయాలు సాధించినట్లుగా తెలిపారు. జిల్లాలో కొద్దిగా క్రైమ్ రేటు పెరిగిందని, ఫిర్యాదులపై సకాలంలో స్పందించడం వల్ల ఇది జరిగింది అన్నారు. భద్రాచలంలో వరదలతో పాటు అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టుకు వరద వచ్చి 40 మంది వరదలో చిక్కుకున్న సంఘటనలో ఒక్కరికి కూడా హాని జరగకుండా కాపాడగలిగామని, ఇది తనకు సంతృప్తిని ఇచ్చిన అంశం అని వ్యాఖ్యానించారు. జిల్లాలో సైబర్ నేరాలు పెరిగాయని, ప్రజల్లో చైతన్యం పెరిగి వెంటనే 1930కు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా అధికంగా వాడకం వల్ల మోసపోతున్నారని తెలిపారు.
రూ.2.5 కోట్లు ఫ్రీజ్ చేసి ఇప్పటికి కోటి 30 లక్షలు తిరిగి బాధితులకు ఇప్పించామన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన గొత్తి కోయ గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నామని, ఇప్పటివరకు రూ. 90 కోట్ల మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయాన్నారు. కమ్యూనిటీ హళ్లు, ఆటలకు అవసరమైన సామాగ్రి, క్రీడా స్థలాలు అవసరం అయినవి ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. జిల్లాలో ఐదు డీడీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్తగా ఏడుగురిపై రౌడీషీట్ తెరిచామన్నారు. ఇప్పటి వరకు 240 మంది పై రౌడీ షీట్లు ఉన్నాయని, ఈ సంవత్సరం 189 మంది పై సస్పెక్ట్ షీట్లు నమోదు చేశామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రహమాన్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఏఆర్డీఎస్ పి.సత్యనారాయణ, మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి, ఇల్లందు డీఎస్పీ ఎం.చంద్రభాను పాల్గొన్నారు.