దిశ, కొత్తగూడెం: జర్నలిస్టులు, ఆదివాసీలపై నిషేధిత మావోయిస్టు పార్టీ చేస్తున్న దాడులు, బెదిరింపులను పిరికిపంద చర్యలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను తాము ఖండిస్తున్నామని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్ట్ పార్టీ కరపత్రాల కింద దాచిన ఐఇడి పేలుడులో కష్టపడి పనిచేసే ఒక జర్నలిస్ట్ ఒడిశాలో మరణించిన విషయం పోలీసు వారికి తెలుసు అని, గతేడాది చర్లలోనూ ఇటువంటి ఘటనలో ఓ పేద ఆదివాసీ గాయపడ్డాడని ఆయన తెలిపారు. మావోయిస్టులు కరపత్రాల కింద, అటవీ ట్రాక్‌లపై ఐఈడిలను అమరుస్తూ చాలా మంది ఆదివాసీలను, వారి జంతువులను చంపుతున్నారని అన్నారు.
మావోయిస్టు పార్టీ ఎప్పుడూ ఆదివాసీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తోందని, గిరిజన మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, పాఠశాలలు, రోడ్లు, ఆసుపత్రులు రావడాన్ని మావోయిస్టు పార్టీ అనుమతించదని అన్నారు. విద్య, ఆరోగ్యం, కమ్యూనికేషన్ పెరిగితే మావోయిస్టు పార్టీ, దాని దోపిడీ నాయకులపై ఆదివాసీలు తిరుగుబాటు చేస్తారని మావోయిస్టులు భయపడుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, సుక్మా, బీజాపూర్, గడ్చిరోలి, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ఆదివాసీలపై మావోయిస్టుల దుశ్చర్యలను బయటకు తీసుకురావడానికి ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేసే జర్నలిస్టులందరికి మేమున్నామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆదివాసీ గ్రామస్తులను నిరంతరం బెదిరింపులకు గురి చేస్తూ వారిని చంపే మావోయిస్టు నాయకులను, వారి సాయుధ బృందాలను తరిమికొట్టాలని ఆదివాసీలందరికీ విజ్ఞప్తి చేశారు.